మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు!

21 Oct, 2014 00:38 IST|Sakshi
మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు!

 ‘‘సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత ఉంటుంది అంటారు. ఆ మాటకొస్తే... ఒక్క సినిమా ప్రపంచం ఏం ఖర్మ.. అన్ని రంగాల్లోనూ పురుషులదే పై చేయి’’ అని శ్రుతీ హాసన్ అంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో పురుషాధిక్యత గురించి ప్రత్యేకంగా మాట్లాడారామె. ఆడవాళ్లు అణిగి మణిగి పడి ఉండాలని మగవాళ్లు కోరుకుంటారనీ, అంత మాత్రాన తగ్గాల్సిన అవసరంలేదనీ శ్రుతీ హాసన్ చెబుతూ -‘‘సినిమా నటి, పాత్రికేయురాలు, అధ్యాపకురాలు, గృహిణి.. ఎవరైనా కానివ్వండి మన దేశంలో అస్సలు రక్షణ లేదు.
 
 మీరు ఇంట్లో ఉండండి, వృత్తి రీత్యా హోటల్లోనో లేక గెస్ట్ హౌస్‌లోనో బస చేయండి.. రక్షణ ఉంటుందని మాత్రం గ్యారంటీ లేదు. అందుకే మహిళలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వయసులో ఉన్నవాళ్లే కాదు... చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికీ ఇండియా అంత సురక్షితం కాదు’’ అని ముక్కుసూటిగా చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచిస్తున్న శ్రుతి తాను కూడా అలానే ఉంటారు. అందుకే, ఎవరో ఆగంతకుడు తన ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు వెంటనే స్పందించి, అతన్ని బయటికి నెట్టివేయగలిగారామె.