మౌనం అంగీకారం కాదు

16 Nov, 2018 01:59 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

‘‘ఎవరో హర్ట్‌ అవుతారని చెప్పి మౌనంగా ఉండిపోకండి. జరిగిన చేదు అనుభవాలను ధైర్యంగా బయటకు చెప్పండి. మార్పు మొదలైంది’’ అంటూ ‘మీటూ’ గురించి రాశారు సోనమ్‌ కపూర్‌ అహూజా. ప్రస్తుతం జరుగుతున్న ‘మీటూ’ ఉద్యమం గురించి సోనమ్‌ కపూర్‌ రాసుకొచ్చారు. ‘‘మార్పుని అందరం కోరుకుంటాం. ఆ మార్పు రావాల్సిన మార్గంలో ప్రయాణించడానికి మాత్రం సంకోచిస్తాం. కానీ మార్పు అనేది పెద్ద కష్టం కూడా కాదు. చాలా సింపుల్‌. కొన్ని చిన్న చిన్న విషయాలు పాటిస్తే సులువే’’ అంటూ పలు పాయింట్స్‌ ప్రస్తావించారు.

‘‘బాధితులను నమ్మండి’. చాలా మంది బాధితురాలిని ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు. తప్పు మీవైపే ఉంది అన్నట్టు కూడా మాట్లాడతారు. కానీ వాటిని పట్టించుకోకండి. ఎంతో ధైర్యం కూడదీసుకుని బయటకు వచ్చి చెబుతున్నవారికి మనం చేయగలిగింది కేవలం వాళ్లను నమ్మడమే. ఇప్పటికీ చాలామంది తల్లులు మగపిల్లలే ఎక్కువ అన్నట్టుగా భావిస్తున్నారు. అలానే పెంచుతున్నారు. అందులో మార్పు రావాలి. ఇద్దరూ సమానమే అన్నట్టుగా పిల్లల్ని పెంచాలి. ఎవరైనా మరొకర్ని కావాలనుకున్నా, తాకాలనుకున్నా కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే.

మౌనం అంగీకారం కాదు. నో అంటే నో అని. లింగ వివక్ష జోక్స్‌ని  మొహమాటానికి కూడా అభినందించకండి. ట్యాగ్‌ తగిలించడం మానేయండి. ఐటమ్‌ సాంగ్స్‌ చేయడం తప్పు కాదు. వాటిని ఐటమ్‌ నంబర్స్‌ అని ముద్ర వేయడం పొరపాటు. నా స్నేహితురాలు ఒకామె మీటూ గురించి మాట్లాడటానికి భయపడుతోంది. ఎందుకంటే తనకి ఎప్పటికీ ‘బాధితురాలు’ అనే ట్యాగ్‌ తగిలిస్తారని. పని ప్రదేశాల్లో స్త్రీలు కూడా ఎక్కువగా పని చేసే వాతావరణాన్ని తీసుకురండి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొని, నిజం నిరూపితమైన వాళ్లతో పని చేయకండి’’ అని పేర్కొన్నారు సోనమ్‌.

మరిన్ని వార్తలు