మహిళలు నిలదొక్కుకోవడం తేలికైన విషయం కాదు

8 Mar, 2014 00:40 IST|Sakshi
మహిళలు నిలదొక్కుకోవడం తేలికైన విషయం కాదు

 ‘‘పురుషాధిక్యతతో కూడిన సినీ పరిశ్రమలో దర్శకురాలిగా సక్సెస్ సాధించడం ఎలా ఉందని చాలామంది అడుగుతుంటారు. కానీ, నాకిది పెద్ద గొప్పగా కూడా అనిపించదు. అందరు దర్శకులు ఎలా ఫీలవుతారో నేనూ అలాగే ఫీలవుతాను. అయితే పరిశ్రమలో స్త్రీలకు సరైన గౌరవం లభిస్తుందా? అనడిగితే కచ్చితంగా లేదనే చెబుతాను. ఇక్కడ  సంఖ్యాపరంగా స్త్రీలు తక్కువ ఉండటం కూడా ఇందుకు ఓ కారణం. సినిమా పరిశ్రమలో స్త్రీలు నిలదొక్కుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఒక పురుషుడు ఇక్కడ నిలదొక్కుకోవడానికి పడే కష్టానికి రెట్టింపు కష్టాన్ని అనుభవిస్తే కానీ స్త్రీలు ఇక్కడ నిలదొక్కుకోలేరు. ఇది నిజంగా బాధాకరమైన విషయమే’’.


 
 ఆమె రుణం వేయి జన్మలైనా తీర్చుకోలేను!
 
 నన్ను ప్రభావితం చేసిన ముగ్గురు స్త్రీ మూర్తులు... అమ్మ, భార్య, కుమార్తె. కష్టపడి పనిచేయడం అమ్మ నేర్పింది... కష్టఫలితాన్ని పదిమందితో పంచుకోవడం భార్య నేర్పింది... కష్టాన్ని మరిచిపోయి నవ్వులతో, కేరింతలతో, సందడిగా జీవితాన్ని మలుచుకోవాలని కూతురు నేర్పింది. ఇది మంచి.. ఇది చెడు అని కౌన్సిలింగ్ పెట్టకుండా... కేవలం ఆచరణతోనే... నాలో కొండంత స్ఫూర్తిని నింపిన నా తల్లి రుణం వేయి జన్మలైనా తీర్చుకోలేను.
 

 నాలో సోమరితనాన్ని పారద్రోలింది అక్కే!
 అమ్మ... భార్య... అక్క. ఈ ముగ్గురూ లేకపోతే నేను లేను. నా జీవితంలో అమ్మ పాత్ర చాలా కీలకం. సంస్కారం అనేది అమ్మ నుంచే నేర్చుకున్నాను. సమాజంలో ఎలా మసలాలి? ఎదుటివారితో ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా కష్టపడాలి? ఎదిగే కొద్దీ ఏ విధంగా ఒదిగి ఉండాలి? ఇవన్నీ నాకు అమ్మే నేర్పింది. ఇప్పటికీ నేను వేసే ప్రతి అడుగులోనూ అమ్మ ప్రభావం ఉందంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈ రోజు ఇలా విసుగు, విరామం, అలసట లేకుండా రోజుకి 18 గంటలు పనిచేస్తున్నానంటే కారణం మా అక్కయ్యే.
 
 తెల్లవారుజామున అయిదింటికే నిద్ర లేపేసేది. నేను ఆర్టిస్టుగా బిజీ అయ్యాక కూడా అక్క ఆ బాధ్యతను మరిచిపోలేదు. చివరకు అది నాకు అలవాటుగా మారింది. ఆ విధంగా నాలోని సోమరితనాన్ని పారద్రోలింది అక్కయ్య. ఇక నా భార్య విషయానికొస్తే... తనను పెళ్లి చేసుకున్నప్పట్నుంచీ నా లైఫే మారిపోయింది. పెళ్లి నాటికే నేను ఆర్టిస్ట్‌గా బిజీ. అయినా... ఆమె నా జీవితంలోకొచ్చాక ఎక్కడలేని పేరు ప్రఖ్యాతులు నా సొంతం అయ్యాయి. నన్ను, నా పిల్లల్ని తాను ప్రేమించే తీరు చూశాకే... ఎదుటివారిని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాను.


 
 నాయనమ్మ ప్రభావం నాపై చాలా ఉంది

 నా జీవితాన్ని ప్రభావితం చేసిన తొలి స్త్రీమూర్తి అమ్మ. చిన్నప్పట్నుంచీ అమ్మ ఎన్నో కష్టాలు చూసింది. కానీ నాకు మాత్రం ఎలాంటి కష్టాన్నీ కలగనీవ్వలేదు. రెండేళ్ల క్రితం నాన్న దూరం అయ్యారు. ఇప్పుడు నాకు అమ్మ, నాన్న.. రెండూ అమ్మే. పని వత్తిడి వల్ల నేను అమ్మకు దూరంగా ఉన్నా... ఆమె దీవెనలు నా వెన్నంటే ఉంటాయి. నా సక్సెస్‌కి కారణం అదే అని నేను నమ్ముతాను. అమ్మ తర్వాత నన్ను ప్రభావితం చేసిన స్త్రీ అంటే... మా నాయనమ్మ. ఆమెకు 90 ఏళ్లు. పేరు కమలమ్మ. నన్ను ఎంతో ముద్దుగా చూసుకునేది. దైనందిన జీవితంలో ఆమె ప్రభావం నాపై చాలా ఉంది. ఇక మూడో స్త్రీ మూర్తి మదర్ థెరీస్సా. సేవాభావం అంటే ఏంటో ఆమెను చూసే నేర్చుకున్నాను. ఎదుటివారికి కొంతైనా ఉపయోగపడాలని ఆమె జీవితం చూసే నేర్చుకున్నాను.