క్షమాపణ కోరడం, కాళ్లు పట్టుకోవడం జరగదు: చిన్మయి

16 Feb, 2020 14:45 IST|Sakshi

సాక్షి, చెన్నై:  సీనియర్‌ నటుడు, దక్షిణ భారత డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ అధ్యక్షుడు రాధారవి, గాయనీ, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయికి మధ్య వివాదానికి తెరపడేలా లేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. గత 2018లో డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌కు జరిగిన ఎన్నికల్లో నటుడు రాధారవి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆయనపై గాయని చిన్మయి మీటూ ఆరోపణలను గుప్పించారు. దీంతో వీరి మధ్య వివాదానికి తెర లేచింది. కాగా గాయని చిన్మయిని యూనియన్‌ నుంచి తొలగించారు. అందుకు ఆమె సభ్యత్వాన్ని చెల్లించలేదన్న కారణాన్ని చూపారు. దీంతో చిన్మయి కోర్టును ఆశ్రయించారు. అక్కడ తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చినా, డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ చిన్మయిని చేర్చుకోలేదు.

కాగా డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ ప్రస్తుతం కార్యవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో శనివారం ఎన్నికలు జరిగాయి. అయితే ఇంతకు ఈ ఎన్నికల్లో మళ్లీ రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి అధ్యక్షపదవికి బరిలోకి దిగారు. అయితే ఎన్నికల అధికారి చిన్మయి నామినేషన్‌ను రద్దు చేశారు. దీంతో ఆమె మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిన్మయి పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఇది అన్యాయం అంటూ చిన్మయి మరోసారి అప్పీల్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. సోమవారం రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. కాగా శనివారం డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ ఎన్నికలు జరిగాయి.

అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను రద్దుకు గురి కావడంతో నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో ఇతర పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు. దీంతో ఆ ఎన్నికలను అడ్డుకునే విధంగా గాయని చిన్మయి పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి రానుందనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా నటుడు రాధారవి మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి క్షమాపణ చెబితే ఆమెను తిరిగి యూనియన్‌లోకి చేర్చుకుంటామని అన్నారు. దీనికి స్పందించిన గాయని చిన్మయి క్షమాపణ కోరడం గానీ,నటుడు రాధారవి ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకోవడం గానీ జరగదన్నారు. తాను చట్ట పరంగానే ఎదుర్కొంటానని ఆమె పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు