నేనూ.. మృణాల్‌దా

6 Jan, 2019 23:47 IST|Sakshi

ఆత్మీయం 

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ సినీదర్శకులు మృణాల్‌ సేన్‌ డిసెంబర్‌ 30న తొంభై ఐదేళ్ల వయసులో కన్నుమూశారు. అప్పటికి కొన్నాళ్లుగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. సేన్‌ చివరి శ్వాసకు కొన్ని రోజుల ముందు నటి నందితాదాస్‌ ఆయన్ని ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సంగతిని ఆయన మరణానంతరం.. నివాళిలో రాస్తూ, ‘నిశ్శబ్ద ఆత్మీయత’ అంటూ ఆయనతో తనకున్న ఇరవై ఏళ్ల అనుబంధం గురించి నందిత వెల్లడించారు. ఆ నివాళిలోని విశేషాంశాలివి.

‘‘మృణాల్‌సేన్‌ని కలవకపోతే నా కోల్‌కతా ట్రిప్‌ పూర్తి అయినట్లు అనిపించదు నాకు. చివరిసారిగా ఆయనను నేను 2018 నవంబరు 11 న ఇంటికి వెళ్లి కలిశాను. అది కూడా మా అబ్బాయిని వెంట తీసుకుని వెళ్లాను. అప్పుడు కోల్‌కతాలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. నన్ను చూసిన ఆయన నా వైపు వచ్చి ఆప్యాయంగా నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఆ రోజంతా ఆయన సమక్షంలోనే గడిపాను. ఇప్పుడిక ఇటువంటి ఆప్యాయతతో కూడిన నిశ్శబ్దాలు లేవు. ఆ రోజున నన్ను.. నేను నటించిన ‘మంటో’ సినిమా గురించి అడిగారు. మా అబ్బాయి చదువు గురించి తెలుసుకున్నారు. ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరడానికి ముందు, ఆయనతో ఫొటోలు తీయించుకున్నాను. అవే ఆయనతో గడిపే ఆఖరి క్షణాలు అవుతాయని నేనెలా ఊహించగలను? ఆయన మౌనంగా నిశీధిలోకి వెళ్లిపోయారని తెలిసి నా మనసు మూగబోయింది.

ప్రేమ మీద నమ్మకం కలిగేది
మృణాల్‌దాతో 20 సంవత్సరాలుగా నా హృదయం ఆప్యాయతను పెనవేసుకుని ఉంది.  ఆయన జీవిత భాగస్వామి ‘గీతాదీ’ నిజంగానే ఆయన జీవితంలో భాగస్వామ్యం వహించారు. ఆయనకు బలమైన సహచరిగా నిలిచారు. ఆయన మౌనంగా ఉంటే, ఆవిడ ఆ నిశ్శబ్దాన్ని తన చిరునవ్వుతో కళకళలాడించేవారు. వారి ప్రేమానురాగాలు,  ఒకరిని ఒకరు గౌరవించుకోవడం చూస్తుంటే, నాకు నిజమైన ప్రేమ మీద నమ్మకం కలిగేది. రెండు సంవత్సరాల క్రితం గీతాదీ మమ్మల్ని వదిలేసి, మృణాల్‌దాని ఒంటరిని చేశారు. అప్పుడే ఆయన మనసు, ఆత్మ ఆవిడతో వెళ్లిపోయాయి. ఆవిడ నిష్క్రమణతో నిత్యం తనను వెన్నంటి ఉన్న ఆత్మవిశ్వాసం కూడా నిష్క్రమించిపోయింది. 

పారితోషికం ఇవ్వలేనన్నారు
నాకు మృణాళ్‌దా పరిచయం అయిన రోజు నుంచి ఆయన నాతో ‘‘నేను నీతో ఒక సినిమా తీయబోతున్నాను. నువ్వు నాకు స్మితాజీని గుర్తు చేస్తున్నావు. ఒక నటిగా కాదు, ఒక వ్యక్తిగా ఆవిడ నాకు గుర్తుకు వస్తుంది’’ అనేవారు. 2002లో ఎట్టకేలకు ఆయన నాతో చిత్రం చేశారు, ఆమార్‌ భువన్‌. అదే ఆయన చివరి సినిమా. బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక ముస్లిం కుటుంబానికి చెందిన కథ ఇది. ఇదొక లవ్‌ ట్రయాంగిల్‌ కథ. అందులో నేను సకినా పాత్ర ధరించాను. ఇద్దరు అన్నదమ్ములకి, సకినాకి మధ్య జరిగిన సంఘర్షణ ఈ కథ.  షూటింగ్‌ ప్రారంభం కావడానికి పదిహేను రోజుల ముందు, మృణాళ్‌దా నాకు ఫోన్‌ చేశారు, నిర్మాతలు ముస్లిం కుటుంబానికి చెందిన కథకు డబ్బులు పెట్టడానికి అంగీకరించట్లేదన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఆ కథ గుజరాత్‌ అల్లర్లు జరిగిన రోజులు కావడంతో, మత విద్వేషాలు బయలుదేరతాయని భావించి ఉంటారు. ముస్లిం సెట్టింగ్‌ వేసినంత మాత్రాన గొడవలేమీ జరిగిపోవని నేను అన్నాను. ఆయన నా మాటలకు స్పందిస్తారని అనుకోలేదు. ‘‘మనం మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఈ సినిమా తీసేద్దాం. నేను నీకు పారితోషికం ఇచ్చుకోలేను’’ అన్నారు.


ఇచ్ఛామతి నది ఒడ్డున
టాకీ అనే గ్రామంలో షూటింగ్‌ ప్రారంభించాం.  ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు షూటింగ్‌ పూర్తయ్యాక, రిలాక్సేషన్‌ కోసం ఎవరో ఒకరి ఇంటికి వెళ్లేదాన్ని. ఆ రోజు నేను టాకీ గ్రామానికి చేరుకునేసరికి, గ్రామమంతా ఈ షూటింగ్‌లో ఇన్‌వాల్వ్‌ అయ్యారని అర్థం చేసుకున్నాను. మాలో ఐదుగురు.. మృణాళ్‌దా, ప్రధాన తారాగణం.. ఒక గెస్ట్‌ హౌస్‌లో ఉన్నాం. దీనికి ఎదురుగా ఇచ్ఛామతి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది. నదికి ఆవలి ఒడ్డున బంగ్లాదేశ్‌ ఉంది. మృణాల్‌దా బంగ్లాదేశ్‌లో సూర్యోదయం, భారతదేశంలో సూర్యాస్తమయం చూశారు. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. మృణాల్‌దా ఫరీద్‌పూర్‌ (బంగ్లాదేశ్‌)లో జన్మించారు. అప్పుడప్పుడు మృణాల్‌దా తన జీవితానికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పేవారు.  ఆయనకు ప్రతి విషయం మీద ఆసక్తి ఎక్కువ. డిన్నర్‌లో మేం తినే చేప గురించి కూడా తెలుసుకునేవారు. తన మనసుకు నచ్చిన ప్రతి విషయాన్ని నాతో పంచుకునేవారు, కళాకారులంటే ప్రత్యేకమైన వారు కాదు, వారు కూడా నిత్య జీవితంలో భాగమే అని ఆయన నమ్మకం.

ఆయన పెట్టిన జ్ఞానభిక్షే
నేను ఆయన ఇంటికి చేరేసరికి, ఆ ఇల్లు గీతాదీ, మృణాళ్‌దా లేకుండా నిర్జీవంగా కనిపించింది. కాని నేను అక్కడకు వెళ్లాను. ఆయనను కడసారి చూడటానికి మాత్రమే కాదు, ఆయన ఏకైక కుమారుడు కునాల్‌ సేన్‌ను కలవడానికి. తండ్రి ఔన్నత్యాన్ని, తల్లి శక్తిని తనలో ఇముడ్చుకున్నాడు కునాల్‌సేన్‌. కునాల్‌ తన తండ్రిని బొంధు (స్నేహితుడు) అని పిలిచేవాడు. ఆయన కునాల్‌కి మాత్రమే కాదు ఎంతో మందికి బొంధు. అందరికీ కాకపోవచ్చు. నాకు మాత్రం ఆయన అసలుసిసలైన స్నేహితుడు, మార్గదర్శకుడు, గురువు.. ఇంకా ఎన్నో. సామాన్యులకు సంబంధించిన కథలను చిత్రాలుగా తీయడమే మనం ఆయనకు సమర్పించే నిజమైన నివాళి. మృణాల్‌దా మహాభినిష్క్రమణంతో ఒక శకం ముగిసింది. నేను ఆయనను తరచుగా కలిసి ఉండకపోతే, ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయి ఉండేదాన్ని. ఆయన ఎప్పటికీ జీవించి ఉండాలనేదే నా స్వార్థమైన కోర్కె.  ఆయనను, ఆయన పనులను మనం సెలబ్రేట్‌ చేసుకోవాలి.  ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
– స్వేచ్ఛానువాదం: వైజయంతి పురాణపండ

నిరాడంబర జీవితం... మృణాళ్‌దా చాలా సామాన్య జీవితం గyì పారు. మరణంలోను అదే ఎంచుకున్నారు. తనకు అభిమాన సంఘాలు వద్దని తన కుటుంబీకులకు స్పష్టంగా చెప్పారు. ఆయన స్థాయికి ఎంతో గౌరవం పొందవచ్చు. గన్‌ శాల్యూట్, లక్షలాది మంది అభిమానుల ప్రేమ, బొకేలు, ప్రణామాలు అన్నీ అందుకోవచ్చు. ఆయన అవేవీ వద్దనుకున్నారు. ఆయనను ప్రేమించేవార ంతా ఆయన కోర్కెను నెరవేర్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వారంతా నిశ్శబ్దంగా ఆయన వెంట నడిచారు. ఒక సామాన్య వ్యక్తిలాగే ఆయన అంతిమయాత్ర ముగిసింది.

మరిన్ని వార్తలు