నవ్వుల రచయితకు నివాళి

8 Jan, 2020 02:20 IST|Sakshi

ప్రముఖ సినీ, నవలా రచయిత ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు ఇక లేరు. కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1940 సెప్టెంబర్‌ 5న విఘ్నేశ్వరరావు మచిలీపట్నంలో జన్మించారు. వినాయక చవితి నాడు పుట్టడంతో తల్లిదండ్రులు ఆయనకు ‘విఘ్నేశ్వరరావు’ అని నామకరణం చేశారు. హిందూ కళాశాలలో బీకామ్‌ చదివిన ఆయన ‘ఆదివిష్ణు’ కలం పేరుతో కాలేజ్‌ రోజుల్లోనే కథలు, నవలలు, నాటకాలు రాయడం ప్రారంభించి, ఆ తర్వాత సినిమా రచయితగా మారారు. కలం పేరు ఆదివిష్ణు కావడంతో ఆయన్ని ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అంటారు. ఉద్యోగం చేస్తూనే 40 సినిమాలకు కథా రచయితగా,  మాటల రచయితగా పని చేసి, హాస్య రచయితగా గొప్ప ఖ్యాతి గడించారు.

1960లలో ఆదివిష్ణు రాసిన నవలలు, నాటికలు, నాటకాలు, కథలకు విశేష ఆదరణ లభించింది. ఆదివిష్ణు కథల్లో హాస్యం, సెంటిమెంట్‌ బాగా పండాయి. ట్రాజెడీ, కామెడీ కలయికలో ఆయన రాసిన ‘మంచు తెర’ అనే నాటకానికి మంచి ఆదరణ లభించింది. సినీ రచయితగానూ మంచి పేరు సంపాదించుకున్నారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరీ సుబ్బారావు’తో పాటు ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన ‘అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, ప్రేమా జిందాబాద్‌’ వంటి చిత్రాలకు కథారచయితగా వ్యవహరించారు. అలాగే బాలమిత్రుల కథ, ఇదాలోకం, కన్నె వయసు, నిజరూపాలు వంటి చిత్రాలకు రచయితగా చేశారు.

‘సుందరి సుబ్బారావు’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డు  అందుకున్నారు. ఇటీవల  హీరో చిరంజీవి చేతుల మీదగా సత్కారాన్ని  అందుకున్నారు. ఉమ్మడి ఏపీఎస్‌ ఆర్టీసీ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గానూ పని చేశారాయన. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఆదివిష్ణు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రింట్‌ అండ్‌ ఎల్రక్టానిక్‌  న్యూస్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (పెన్‌) దిగ్భ్రాంతి  వ్యక్తం చేసింది. ఇంకా సీనియర్‌  పాత్రికేయులు, నవలా రచయిత నందం రామారావు, ‘పెన్‌’ సంఘం నేతలు బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్, సనకా వెంకటనాథ ప్రసాద్, సామర్ల మల్లికార్జున రావు, పోతన వెంకటరమణ, రవిచంద్, వంగర శర్మ సంతాపం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా