ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు

23 Nov, 2014 22:33 IST|Sakshi
ఆ క్రమశిక్షణ సతీశ్‌లో కనిపించింది : మోహన్‌బాబు

‘‘ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. కథ ఎలా ఉన్నా... దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించేది దర్శకుడే. అలాంటి దర్శకుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఆయన దర్శకునిగా మారి దాదాపు పాతికేళ్లు అయ్యింది. 40 ఏళ్లుగా నేను ఈ రంగంలో ఉన్నా... ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇప్పుడు కలిగింది’’ అని మోహన్‌బాబు అన్నారు. కె.సతీశ్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.ఆశా సతీశ్ నిర్మించిన చిత్రం ‘యమలీల-2’. మోహన్‌బాబు ఇందులో యమునిగా నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
  ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. ‘‘ఇంత క్రమశిక్షణగా మేం నడుచుకుంటున్నామంటే కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరిగార్లు నేర్పిన క్రమశిక్షణే. ఈ చిత్ర కథానాయకుడు సతీశ్‌లో కూడా అదే క్రమశిక్షణ కనిపింది. ఇందులో నేను పోషించిన యముడి పాత్ర నాకు ప్రత్యేకం’’ అని మోహన్‌బాబు తెలిపారు. ఆడియోలాగే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని హీరో కె.సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘సతీశ్ కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. అభినయంతో పాటు డాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేశాడు. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం పాత్రలు ఈ చిత్రానికి హైలైట్’’ అని నమ్మకం వెలిబుచ్చారు.
 
  నటునిగా మోహన్‌బాబు 40వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని కె.అచ్చిరెడ్డి అన్నారు. ‘యమలీల’ టైమ్‌కి తాను ఓ ప్రేక్షకుణ్ణి మాత్రమేననీ, ‘యమలీల-2’కి వచ్చే సరికి పంపిణీదారుని స్థాయిలో జ్ఞాపిక అందుకోవడం ఆనందంగా ఉందనీ ‘దిల్’ రాజు సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో భాగంగా అప్పటి ‘యమలీల’ కథానాయకుడు అలీని ఈ ‘యమలీల-2’ యూనిట్ ఘనంగా సత్కరించింది.