ఆ సినిమాలానే... ఇది కూడా!

8 Nov, 2014 22:53 IST|Sakshi
ఆ సినిమాలానే... ఇది కూడా!

 ‘యమలీల’ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి యమధర్మరాజు నేపథ్యంలోని కథాంశంతో  తెరకెక్కించిన చిత్రం ‘యమలీల-2’. డా. కేవీ సతీశ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ఆశా సతీశ్ నిర్మాత. ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటిం చారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ-‘‘‘యమలీల’ లాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటునిగా సతీశ్‌కి గొప్ప భవిష్యత్తు ఉంది. యమునిగా మోహన్‌బాబు, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం అద్భుతంగా నటించారు.
 
 పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమవడం ఆనందంగా ఉందనీ, మోహన్‌బాబు, బ్రహ్మానందం లాంటి సీనియర్స్‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ సతీశ్ అన్నారు. త్వరలోనే పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపుతామనీ, 500 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తామనీ సహ నిర్మాత డి.కె.అరుణ్‌కుమార్ తెలిపారు. దియా నికోలస్ నాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్-భవానీ ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్.