కోర్టుకెళ్తున్న హీరోయిన్‌

31 May, 2018 13:47 IST|Sakshi
యామి గౌతమ్‌ (ఫైల్‌ ఫోటో)

సినిమాల కంటే కూడా ఒక ప్రముఖ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ప్రకటన ద్వారా ఎక్కువమందికి పరిచయమైన హీరోయిన్‌ యామి గౌతమ్‌. అయితే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ తరచుగా బాంబే హైకోర్టు బయట కనిపిస్తుంది. అది కూడా షాహీద్‌ కపూర్‌ కోసమంట. వీరిద్దరి మధ్య ఏమైనా వివాదాలు వచ్చాయా.. కోర్టుకెల్లేంత పెద్ద గొడవలు ఏం జరిగి ఉంటాయబ్బ అని ఆలోచిస్తున్నారా.. అయితే మీ ఆలోచనలకు అక్కడే ఫుల్‌స్టాప్‌ పెట్టండి. ఎందుకంటే యామి కోర్టుకు వెళ్తుంది విచారణ ఎదుర్కోవడానికి కాదు. తదుపరి చిత్రం ‘బట్టి గుల్‌ మీటర్‌ చలు’లో చేయబోయే లాయర్‌ పాత్ర కోసం ఈ అమ్మడు తరచు కోర్టుకు వెళ్తూ... లాయర్ల పనితీరు గురించి తెలుసుకుంటోంది. సినిమా అంటే ఎంత డెడికేషనో యామీకి!

ప్రస్తుతం యామి.. శ్రీనారాయణ సింగ్ దర్శకత్వంలో, షాహిద్‌ కపూర్‌ హీరోగా రూపొందుతున్న ‘బట్టి గుల్‌ మీటర్‌ చలు’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చిన్నపట్టణాల్లో ఎదురయ్యే విద్యుత్‌ సమస్యల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో యామి లాయర్‌గా కనిపించనుంది. ‘కోర్టు ప్రొసిడింగ్స్‌ ఎలా ఉంటాయి. ప్రాసిక్యూషన్‌ బాధితుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయంలో నాకు సహాయం చేయమని ఒక లాయర్‌ స్నేహితురాలిని కోరాను. ఇప్పుడైతే కోర్టుకు సెలవులు కానీ అదృష్టం కొద్ది నా లాయర్‌ స్నేహితురాలు మరికొందరు లాయర్లు కలిసి ఒక వెకేషన్‌ బెంచ్‌ సెషన్‌ను నిర్వహిస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభమయ్యేలోపు నిజంగా కోర్టులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకునేందుకు కోర్టుకు హాజరవుతున్నా’ని యామి చెప్పారు.

‘బట్టి గుల్‌ మీటర్‌ చలు’ కాక ఆదిత్య ధార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉరి’ చిత్రంలో కూడా ఆమె నటించనున్నారు. 2016, సెప్టెంబర్‌లో ‘ఉరి సెక్టార్‌’లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరెకెక్కనున్న ఈ చిత్రంలో యామి పవర్‌పుల్‌ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనుంది.

మరిన్ని వార్తలు