కేజీఎఫ్‌ అంటే?

22 Sep, 2018 00:31 IST|Sakshi
తమన్నా, యష్‌

యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కె.జి.ఎఫ్‌’. తమన్నా ఓ ప్రత్యేక పాటలో నటించారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరంగధూర్‌ నిర్మించారు. చిత్ర సహనిర్మాత కైకాల రామారావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్‌ మొత్తం పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం రీ–రికార్డింగ్‌ జరుపుకుంటోంది. సినిమా ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అక్టోబరు 14న ట్రైలర్, నవంబరు 16న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

‘‘అమెరికా–రష్యాకు మధ్య జరిగిన యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా బంగారం ధర పెరగడంతో మనుషుల్లో అత్యాశ పెరిగింది. అదే సమయంలో ‘కె.జి.ఎఫ్‌’ (కోలార్‌ బంగారు గనులు) భారత దేశంలోనే అతిపెద్ద బంగారు గని. అది ఒక్క మనిషి చేతిలోకి వెళితే ఏమవుతుంది? అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఫస్ట్‌ పార్టుగా రూపొందిస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్‌ నీల్‌. ‘‘1970 కాలంలో జరిగిన మాఫియా నేపథ్యంలో జరిగిన కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని యాక్షన్‌ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు విజయ్‌ కిరగంధూర్‌. ఈ చిత్రానికి కెమెరా: భువన్‌ గౌడ, సంగీతం: రవి భసూర్‌.

మరిన్ని వార్తలు