కొత్త రచయితల కోసం...

2 Mar, 2019 05:39 IST|Sakshi
మహి వి.రాఘవ్‌

‘ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్‌ మహి వి.రాఘవ్‌. వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. ‘‘ఓ గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలంటే మూడు ముఖ్యాంశాలు కావాలి.. అందులో మొదటిది కథ, రెండోది కథ, మూడోది కూడా కథే. ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్‌ మేకర్‌ ఆల్ఫ్రెడ్‌ హిచ్‌ కాక్‌ చెప్పిన ఈ మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నాను’’ అని మహి వి. రాఘవ్‌ తెలిపారు. శివమేక, రాకేష్‌ మంహకాళి వంటి సన్నిహితులతో కలసి ‘త్రీ ఆటమన్‌ లీవ్స్‌’ పేరిట ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించారు మహి. ‘‘సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడక్షన్‌ సంస్థల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుదల చేసే పద్ధతికి పూర్తి భిన్నంగా మా సంస్థ అడుగులు వేస్తుంది.

ఔత్సాహికులైన రచయితల్ని, సినిమా కథలు రాయగలిగే సత్తా ఉన్న యువ ఫిల్మ్‌ రైటర్స్‌ని ప్రోత్సహిస్తూ వారి చేత కొత్త కథల్ని తయారు చేయించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. కథలకి, కథకులకి డబ్బులు పెడుతూ అలా పురుడు పోసుకున్న స్క్రిప్ట్స్‌ని పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు మా సంస్థ ముందుంటుంది. ‘యాత్ర’ సినిమాకి ‘త్రీ ఆటమన్‌ లీవ్స్‌’ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరించింది. ఔత్సాహికులైన రచయితల్ని, కొత్త కథల్ని ప్రోత్సహించే నిర్మాణసంస్థలతో భాగస్వాములు అయ్యేందుకు మా సంస్థ ముందుంటుంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లు, డాక్యుమెంటరీ రచయితలు, ఫిల్మ్‌ మేకర్స్, నిర్మాణ సంస్థలు, చానల్‌ పార్టనర్స్‌తో జతకలిసేందుకు ‘త్రీ ఆటమన్‌ లీవ్స్‌’ సంస్థ సుముఖంగా ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు