వడివేలు పాత్రలో యోగిబాబు?

20 Feb, 2019 10:01 IST|Sakshi

తమిళసినిమా: నటుడు వడివేలు పాత్రను మరో నటుడు యోగిబాబు రీప్లేస్‌ చేయబోతున్నాడా? ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది ఈ విషయమే. వడివేలు ఒకప్పటి కామెడీ కింగ్‌. అలాంటి స్థాయిలో ఉండగా హీరోగా అవతారమెత్తాడు. అందుకు కారణం ప్రముఖ దర్శకుడు శంకర్‌నే. ఈయన ఎస్‌.ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మించిన ఇంసై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రంతో వడివేలును ఏకంగా ద్విపాత్రాభినయంలో హీరోగా పరిచయం చేశారు. దీనికి శంకర్‌ శిష్యుడు శింబుదేవన్‌ దర్శకుడు. ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో  వడివేలు కామేడీ పాత్రలను పక్కన పెట్టేసి హీరో పాత్రలపైనే దృష్టి సారించాడు. శంకర్, దర్శకుడు శింబుదేవన్‌ పులికేసికి సీక్వెల్‌ను చేపట్టారు. వడివేలునే హీరో.ఈ చిత్రం కోసం చెన్నైలో బ్రహ్మాండ సెట్స్‌ వేసి షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ కూడా పూర్తి చేశారు. ఆ తరువాతనే వివాదాలు తలెత్తాయి. దర్శకుడికి, వడివేలుకు మధ్య భేదాభిప్రాయాలు కారణంగా ఇంసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చిత్రం కోసం వేసిన భారీ సెట్స్‌ కూలగొట్టాల్సిన పరిస్థితి.

నిర్మాతగా దర్శకుడు శంకర్‌కు సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. దీంతో నిర్మాతల మండలి, నడిగర్‌సంఘంలో ఫిర్యాదులు, పంచాయితీలు చాలానే జరిగాయి. ఒక దశలో వడివేలు నష్టపరిహారం చెల్లించాలంటూ శంకర్‌ డిమాండ్‌ చేశారు. వడివేలుపై రెడ్‌ కార్డు పడనుందనే ప్రచారం జరిగింది. ఇంత రాద్ధాంతం తరువాత ఎట్టకేలకు వడివేలు మళ్లీ నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడనే ప్రచారం జరిగింది. అయితే చిత్ర షూటింగ్‌ మాత్రం మొదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు పాత్రలో నటుడు యోగిబాబును నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. యోగిబాబు గురించి చెప్పాలంటే ఇప్పుడు నంబర్‌వన్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. గత ఏడాదిలో ఇతను 10 చిత్రాల్లో నటించాడు. అంతే కాదు ఇప్పుడితను హీరోగా అవతారమెత్తాడు. ధర్మప్రభు అనే చిత్రంలో యముడుగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇతనికి పెద్ద అభిమాన గణమే ఉంది. దీంతో ఇంసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రంలో వడివేలుకు బదులు యోగిబాబును నటింపజేసే అలోచనలో చిత్ర వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం ఇప్పటికీ వడివేలునే నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వడివేలు దిగి రాకపోతే యోగిబాబును లైన్‌లో పెట్టాలని భావిస్తున్నట్లు టాక్‌. ఈ విషయంలో వాస్తవాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
 

మరిన్ని వార్తలు