కుటుంబంతో హాయిగా నవ్వుకోవచ్చు

6 Jun, 2018 00:29 IST|Sakshi

‘‘ఓ హీరోయిన్‌ నిజ జీవితంలోనూ ఓ సాధారణ యువకుడితో ప్రేమలో పడటం చాలా సందర్భాల్లో జరిగాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలుంటాయి. ‘సీతామాలక్ష్మి, రంగీలా, శివరంజని’ సినిమాలు ఇదే నేపథ్యంలో వచ్చాయి. మా ‘సమ్మోహనం’ సినిమా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘పెయింటింగ్‌ వేసే ఓ సాధారణ మధ్య తరగతి యువకునికి సినిమా వాళ్లంటే కొంత చిన్నచూపు ఉంటుంది. అలాంటి యువకుడికి ఓ స్టార్‌ హీరోయిన్‌ ఎలా పరిచయమైంది? వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఎలాంటి మజిలీ చేరుకుందన్నదే ‘సమ్మోహనం’ కథ. ఇంద్రగంటితో 2016లో ‘జెంటిల్‌మన్‌’ సినిమా చేశా.

సరిగ్గా రెండేళ్ల తర్వాత ‘సమ్మోహనం’ చేశా. గత ఏడాది ఆయన నాకు ‘సమ్మోహనం’ కథ చెప్పారు. కుటుంబంతో హాయిగా నవ్వుకుని చూసే ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ఇది. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. కథకు తగ్గట్టే ఇంద్రగంటి ‘సమ్మోహనం’ టైటిల్‌ పెట్టారు. ఓసారి పనిచేసిన దర్శకుడితో మరో సినిమా చేయాలంటే మొహమాటపడేవాణ్ణి. ఇంద్రగంటితో వరుసగా రెండు సినిమాలు చేశాను. నాతో వరుసగా మరో సినిమా చేద్దామనే ప్రపోజల్‌ కూడా ఆయనదే. ఈ పాత్రకు అదితీరావు హైదరీ బావుంటుందని ఇంద్రగంటి చెప్పారు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. నెక్ట్స్‌ ఎవరితో అనేది ఇంకా అనుకోలేదు’’ అన్నారు.  

మరిన్ని వార్తలు