మీ పని సెన్సార్ చేయడం కాదు: హైకోర్టు

10 Jun, 2016 15:06 IST|Sakshi
మీ పని సెన్సార్ చేయడం కాదు: హైకోర్టు

ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)పై బాంబే హైకోర్టు తీవ్రంగా మండిపడింది. బోర్డు పని సినిమాలను సర్టిఫై చేయడమే తప్ప సెన్సార్ చేయడం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ సినిమాలో డ్రగ్స్‌ గురించి మరీ ఎక్కువగా చూపించారనుకుంటే సినిమా మొత్తాన్ని ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించింది. టీవీ గానీ, సినిమా గానీ.. ఏదైనా ఒక రాష్ట్రాన్ని అవమానించేలా ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలే నిర్ణయించుకోవాలని, ఆ స్వేచ్ఛను ప్రజలకు ఇవ్వాలని బోర్డుకు సూచించింది.

ఉడ్తా పంజాబ్ సినిమాకు 90కి పైగా కట్‌లు పెట్టడంతోపాటు సినిమా పేరు కూడా మార్చాలని సీబీఎఫ్‌సీ చెప్పడంతో చిత్ర దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాలో వాడిన కొన్ని పదాలు, సీన్లు చాలా అసభ్యంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని సీబీఎఫ్‌సీ వాదించింది. సినిమాలో ఒక కుక్క పేరు జాకీచాన్ అని పెట్టారని.. అది అభ్యంతరకరమని చెప్పింది. ఈ కేసులో వాదనలు ముగిశాయి. తుది తీర్పును ఈనెల 13వ తేదీన వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.

సీబీఎఫ్‌సీ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ కావలనే తన సినిమాను సర్టిఫై చేయడం లేదని నిర్మాత అనురాగ్ కశ్యప్ ఆరోపించారు. షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, దిల్జీత్ దోసంజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో.. ప్రధానంగా పంజాబ్‌లో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ గురించి చర్చించారు. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 17న విడుదల కావాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా