ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

13 Aug, 2018 01:04 IST|Sakshi

మహర్షి – టీజర్‌
నిడివి 0.42 సె. ,హిట్స్‌ 55,00,827
‘భరత్‌ అనే నేను’ సినిమా తర్వాత మహేశ్‌బాబు చుట్టూ ఉన్న ‘ఆరా’ ఇంకా పెరిగింది. ఆయన స్టార్‌డమ్‌ మరో మెట్టు పైకి ఎదిగింది. ఫ్యాన్స్‌ ఆయన సినిమాల కోసం ఎదురు చూడటం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం పేరు ‘మహర్షి’ అని అనౌన్స్‌ చేసి విడుదల చేసిన టీజర్‌లో కాలేజ్‌ స్టూడెండ్‌ మహేశ్‌ ప్రదర్శించిన స్టయిల్, లుక్‌ అభిమానులను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది.

కాలేజ్‌ కారిడార్‌లో గళ్ల చొక్కా జీన్స్‌ ప్యాంట్‌ వేసుకొని చేతిలో ల్యాప్‌ టాప్‌తో నడుస్తూ పక్కన వెళుతున్న ఆడపిల్లల వైపు ఒక లుక్కు వేస్తున్న సన్నివేశం సినిమా మీద కుతూహలాన్ని ఆసక్తిని పెంచేలా ఉంది. నాగార్జున, కార్తిలతో ‘ఊపిరి’ వంటి హిట్‌ తీసిన వంశీ పైడిపల్లి మరెంతో శ్రద్ధతో ఈ సినిమా కథను తయారు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్‌ రాజు సంస్థ, వైజయంతి మూవీస్, పీవీపీ... ఈ మూడు దిగ్గజాలు సినిమాను నిర్మిస్తున్నందు వల్ల మేకింగ్‌ టాప్‌ క్లాస్‌ ఉండే అవకాశం ఉంది. గతంలోని వంశీ దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా వచ్చింది. ఇన్నేళ్లకు మళ్లీ అదే టైటిల్‌తో సినిమా రావడం గమనించదగ్గ అంశం.


హెలికాప్టర్‌ ఈలా – ఆఫీషియల్‌ ట్రైలర్‌
నిడివి 2 ని. 46 సె. ,హిట్స్‌ 1,02,73,021
పిల్లలు కాలేజ్‌ వయసుకు చేరుకున్నాక, వయసు 40 దాటాక, భర్త తన ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో తీవ్రంగా బిజీ అయిపోయాక స్త్రీలకు సడన్‌ తమ గుర్తింపు సమస్య ఏర్పడుతుంది. తానేమిటో నిరూపించుకోవాలనిపిస్తుంది. లేదా జీవితం వృధా అయిపోయిందని ఇప్పటికైనా సద్వినియోగం చేసుకోవాలని సడన్‌గా అనిపిస్తుంది. నిజానికి పిల్లలతో, భర్తతో మానసికంగా వచ్చిన దూరాన్ని మరి దేనితోనైనా భర్తీ చేయాలనిపిస్తుంది.

అప్పుడు అలాంటి స్త్రీ ఏం చేస్తుందనేది వ్యక్తిని, పరిసరాలని బట్టి మారుతూ ఉంటుంది. ఈ సినిమాలో కాలేజీ వయసుకొచ్చిన కొడుకుకు తల్లైన కాజోల్‌ తాను కూడా చదువుకోవాలని, మ్యూజిక్‌ నేర్చుకోవాలని భావించి కొడుకు చదువుతున్న కాలేజీలోనే చేరాలనుకోవడంతో సమస్య మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైందనేది కథ. ‘పరిణీత’ వంటి మంచి సినిమా తీసిన దర్శకుడు ప్రదీప్‌ సర్కార్‌ ఈ సినిమాకు దర్శకుడు. అజయ్‌ దేవగన్‌ నిర్మాత. భిన్న భావోద్వేగాలు ఉంటాయని ఈ ట్రైలర్‌ హింట్‌ చేస్తోంది. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదల కానుంది.


ఆరామ్‌ సే సోవూంగా –  కామెడీ షార్ట్‌ఫిల్మ్‌
నిడివి 7 ని. 44 సె. , హిట్స్‌ 18,27,583
‘ఆరామ్‌ సే సోవూంగా’ అంటే హాయిగా నిద్ర పోతాను అని అర్థం. ఇంజనీరింగ్‌ చదువుతున్న ఒక స్టూడెంట్‌ హాస్టల్‌లో ఉంటూ మరుసటిరోజు ఉదయం క్లాసుకు అటెండ్‌ అవ్వాలని చెప్పి ఆ రాత్రి తొందరగా నిద్రపోవాలని అనుకుంటాడు. కాని అతడు హాయిగా నిద్ర పోవడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ఈ షార్ట్‌ఫిల్మ్‌ వినోదాత్మకంగా చూపిస్తుంది. ఫేస్‌బుక్, వాట్సప్, యూ ట్యూబ్‌ ఇవన్నీ అతడి టైమ్‌ను నిముషాల లెక్కన తినేస్తూ ఉంటాయి.

రాత్రి పది గంటలకు నిద్ర పోవాలనుకున్నవాడు యూ ట్యూబ్‌లో వీడియో చూసి కింద కామెంట్స్‌లో ఎవరితోనో వాదనకు దిగి నానా బూతులు తిట్టి టైమ్‌ను చుట్టబెట్టేస్తాడు. రాత్రి ఒంటి గంటకు ఆకలైతే క్యాంటిన్‌కి వెళ్లి ఏదో తెచ్చుకుని ఆ తినేది ఏదైనా చూస్తూ తినొచ్చు కదా అని తిరిగి యూ ట్యూబ్‌ చూస్తూ తెల్లారి ఏడుకు నిద్ర పోతాడు. ఇవాళ రేపు స్టూడెంట్స్‌ ఇన్ని డైవర్షన్స్‌ మధ్య కొద్దో గొప్పో చదవగలగడం గొప్పే అనిపిస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్‌ చూస్తే. ఇలాంటి షార్ట్‌ఫిల్మ్స్‌ తీయడంలో అందెవేసిన ‘ది వైరల్‌ ఫీవర్‌’ (టి.వి.ఎఫ్‌) యూ ట్యూబ్‌ చానల్‌ సమర్పణ ఇది.

మరిన్ని వార్తలు