ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

10 Sep, 2018 01:52 IST|Sakshi

అంధా ధున్‌ – ట్రైలర్‌
నిడివి 2 ని. ,హిట్స్‌ 1,61,42,070

అంటే చీకటి పాట అని అర్థం. ఈ మధ్యే హృతిక్‌ రోషన్‌ అంధుడిగా ‘కాబిల్‌’ అనే థ్రిల్లర్‌ వచ్చింది. ఈ అంధా ధున్‌ కూడా థ్రిల్లరే. అయితే ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. తన సమక్షంలో జరిగిన హత్యలను ఆ అంధుడు గుర్తించి ఎలా నిందితులను పట్టుకున్నాడా అనేది కథ. ‘విక్కీ డోనర్‌’, ‘జోర్‌ లగాకే హైసా’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన హీరో ఆయుష్మాన్‌ ఖురానా ఈ సినిమాను కూడా హిట్‌ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. టబూ, రాధికా ఆప్టే ఇతర ప్రధాన తారలు. గతంలో ‘ఏక్‌ హసీనా థీ’, ‘రామన్‌ రాఘవన్‌’, ‘బద్‌లాపూర్‌’ వంటి సినిమాలు తీసిన శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ సినిమా దర్శకుడు. అక్టోబర్‌ 5 విడుదల.


నోటా  – ట్రైలర్‌
నిడివి 1 ని. 39 సె. ,హిట్స్‌ 49,08,923

ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వాలు ఏర్పడాలంటే అభ్యర్థులను ఎంచుకోవాలి. అభ్యర్థులను ఎంచుకోవాలంటే వారు నచ్చాలి. నచ్చితే ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తుపై ఓటు వేస్తాం. నచ్చకపోతే? ఎన్నికలలో నిలబడిన ఏ అభ్యర్థీ నచ్చకపోతే? అప్పుడు ప్రజలు నొక్కాల్సిన మీట ‘నోటా’. ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థులకు పవర్‌ ఉన్నట్టే ఈ ‘నోటా’కు కూడా పవర్‌ ఉంటుంది. దీనిని సరిగా ఉపయోగించిన రోజు పార్టీల పట్ల ఈ దేశంలోని ప్రజలకు నిజమైన అంగీకారం ఏమేరకు ఉందో తెలిసి వస్తుంది.

విజయ్‌ దేవరకొండ చాలా త్వరగానే బైలింగ్వల్‌ సినిమా స్థాయికి ఎదిగాడు. ‘నోటా’ తమిళంలో తెలుగులో ఏకకాలంలో నిర్మితమైంది. ఇందులో విజయ్‌ దేవరకొండ ‘కీలుబొమ్మ సి.ఎం’గా కనిపిస్తాడు. కాని అతడికి రాజకీయాల మర్మం నిజంగా తెలిసిననాడు ఏం చేశాడనేది కథ కావచ్చు. విక్రమ్‌ ‘హిజ్డా’గా నటించి హిట్‌ చేసిన సినిమా ‘ఇంకొక్కడు’కు దర్శకత్వం వహించిన ఆనంద్‌ శంకర్‌ ఈ సినిమాకు కూడా దర్శకుడు. నాజర్, సత్యరాజ్‌ తదితరులు సహపాత్రలు పోషించారు. మెహ్రీన్‌ హీరోయిన్‌. ఎన్నికలు వస్తున్న వేళ ఈ సినిమా ప్రేక్షకులలో ఆసక్తి రేపవచ్చు.


అదీ లెక్క – షార్ట్‌ ఫిల్మ్‌
నిడివి 13 ని. 40 సె. ,హిట్స్‌ 63,990

తెలుగులో వచ్చిన కథలలో నుంచి షార్ట్‌ఫిల్మ్స్‌కు అనువైన వాటిని ఎంచుకుని ‘ఎల్‌బి శ్రీరామ్‌ హార్ట్‌ఫిల్మ్స్‌’ పేరుతో రెగ్యులర్‌గా నిర్మిస్తున్న నటుడు ఎల్‌.బి.శ్రీరామ్‌ తాజాగా అందించిన షార్ట్‌ఫిల్మ్‌ ఇది. రిటైరైన లెక్కల మాస్టారు తాను రిటైరైనా తనలోని మాస్టారు ఎప్పటికీ రిటైర్‌ కాడని ‘లెక్క తప్పిన’ విద్యార్థి ఎప్పుడు కనిపించినా తిరిగి సరైన లెక్కలో పెడతాడని ఈ షార్ట్‌ఫిల్మ్‌ చెబుతుంది. మదనపల్లి సమీపంలో తీయడం వల్ల ఒక దేశీయమైన వాతావరణంలో ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఆహ్లాదంగా అనిపిస్తుంది.

ఎల్‌.బి. శ్రీరామ్‌ మాటలు ఆయనలోని నటుడిలాగే రచయిత కూడా మసకబారలేదని నిరూపిస్తాయి. రెండు వేల నోటు పోగొట్టుకుని ఇల్లు చేరిన ఎల్‌.బి.శ్రీరామ్‌తో ఆయన భార్య ‘పోతే పోయింది లేండి. డబ్బది. ఎన్ని చేతుల్లోంచి పోవాలో... ఎన్ని చేతుల్లోకి పోవాలో’ అంటుంది. ఇలాంటివి చాలా చమక్కులే ఉన్నాయి. విద్యార్థులకు చూపదగ్గ ఫిల్మ్‌ కూడా ఇది. ఎల్‌.బి.శ్రీరామ్‌లాగే మరికొంతమంది సీనియర్‌ నటులు, దర్శకులు పూనుకుని తెలుగులోని మంచి కథలను షార్ట్‌ఫిల్మ్స్‌గా తీస్తే బాగుండు.

మరిన్ని వార్తలు