ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

1 Oct, 2018 01:06 IST|Sakshi

థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌– అఫీషియల్‌ ట్రైలర్‌
నిడివి 3 ని.38సె , హిట్స్‌ 42,342,521
భారతదేశంలో థగ్గుల చరిత్ర చాలానే ఉంది. ఆ పేరు చెప్పగానే నేటికీ ఉలిక్కిపడేవాళ్లున్నారు. బాటసారులతో కలిసిపోయి అదను చూసి తడిగుడ్డతో గొంతుకోసే థగ్గుల గురించి వందలాది కథలు ప్రచారంలో ఉన్నాయి. మొఘలు సామ్రాజ్యం అంతమయ్యి బ్రిటిష్‌ పాలన వేళ్లూనుకుంటున్న సంధి కాలంలో థగ్గులు రెచ్చిపోయారు. వీరి చేతుల్లో దాదాపు 50 వేల మంది చనిపోయి ఉంటారని కొందరు లక్ష వరకు సఫా అయి ఉంటారని మరికొందరు అంటారు.

ఈ నేపథ్యంలో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ పేరుతో సినిమా రావడం పెద్ద ఆసక్తి కలిగించే అంశం. దీనిని దర్శకుడు ‘దేశభక్తి’ కోణం నుంచి చూడటం విశేషం. థగ్గులు దేశభక్తులనీ బ్రిటిష్‌వారిని ఎదిరించారని ఈ కథలో చెప్తున్నాడు. చరిత్రకారుల్లో కొందరి అభిప్రాయం ఏమిటంటే థగ్గులను పెంచి పోషించింది బ్రిటిష్‌వారే అని. భారతీయులలో భయం పెంచి తమను శరణుజొచ్చేలా చేయడానికి థగ్గులను రెచ్చగొట్టారని కొందరి పరిశీలన.

ఏమైనా ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, ఆమిర్‌ఖాన్‌ తొలిసారి జోడి కట్టడం, కత్రీనాకైఫ్‌ తన సొగసును చిందించడం, భారీ ఖర్చు, ‘పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌’ తరహా మేకింగ్‌ ఇవన్నీ మాస్‌ ప్రేక్షకుడిని లొట్టలేసేలా చేస్తున్నాయి. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ సినిమాను ‘ధూమ్‌3’ దర్శకుడు విజయ్‌కృష్ణ ఆచార్య తెరకెక్కించాడు. నవంబర్‌ 8 విడుదల.

బజార్‌ – అఫీషియల్‌ ట్రైలర్‌
నిడివి 2 ని. 42 సె. , హిట్స్‌ 13,477,557
కోట్లకు పడగలెత్తినవారు మరిన్ని వందల కోట్ల కోసం సహస్రఫణులను ఎలా విప్పుతారో సామాన్యుడి ఊహకు అంతుచిక్కని అంశం. ఇవాళ బజారులో పచారీకొట్టులో చిన్న చిన్న వస్తువులను కొనే సామాన్యుడికి ఆ వస్తువుల విస్తరణ కోసం మార్కెట్‌ మీద ఆధిపత్యం కోసం తద్వారా దేశం మీద అజమాయిషీ కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో తెలిసే అవకాశం లేదు. ‘బజార్‌’ సినిమా బహుశా అలాంటి కథను చెప్పే అవకాశం ఉంది.

డబ్బు తప్ప వేరే ఏమీ ఆలోచించని ఒక వ్యాపారవేత్త తనను ఢీకొట్టడానికి వచ్చిన ఒక కుర్రకుంకతో కలిసి ఎటువంటి మాయోపాయాలు పన్ని ఉంటాడనేది కథ కావచ్చు. ‘మారథాన్‌ను గెలిచినవాణ్ణి ఎవరూ గుర్తు పెట్టుకోరు. హండ్రెడ్‌ మీటర్స్‌ రేస్‌ గెలిచినవాణ్ణి జ్ఞప్తికి పెట్టుకుంటారు’ వంటి డైలాగులు ఉన్నాయి. సైఫ్‌ అలీఖాన్‌ శక్తిమంతమైన పాత్రను పోషించినట్టుగా ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. రాధికా ఆప్టే, చిత్రాంగదా సింగ్‌ తెర మీద కొన్ని హాట్‌ హాట్‌ సన్నివేశాలు ఊతం ఇచ్చినట్టు కనిపిస్తోంది. గౌరవ్‌ కె.చావ్లా దర్శకుడు. అక్టోబర్‌ 26 విడుదల.

లవ్‌ ఈజ్‌ లవ్‌  – హిందీ షార్ట్‌ ఫిల్మ్‌
నిడివి 11 ని. 53 సె. ,హిట్స్‌ 916,603
పెళ్లిచూపులు జరుగుతుంటాయి. అబ్బాయి ఫ్రాంక్‌గా మాట్లాడే టైప్‌. ‘నా కాలేజీ రోజుల్లో నాకు ఇద్దరు గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉండేవారు’ అంటాడు. ‘మరి నీ సంగతి’ అని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం సందిగ్ధంగా ‘నాక్కూడా’ అంటుంది. ఆ అబ్బాయి ‘ఆమెకు ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నార’ని అర్థం చేసుకుంటాడు. వాస్తవానికి ఆ అమ్మాయి చెప్పింది తనకు ఇద్దరు ‘గర్ల్‌ఫ్రెండ్స్‌’ ఉన్నారని. వ్యక్తులు తమ లైంగికతను, లైంగిక ఆసక్తులను బయటపెట్టే వాతావరణం ఇప్పుడిప్పుడే దేశంలో కనిపిస్తోంది.

సజాతి వ్యక్తుల ఆకర్షణకు సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. కొన్ని చోట్ల సంప్రదాయ కుటుంబాల వారు కూడా చేదు దిగమింగుకునో లేదంటే పరిణితితో ఆలోచించో ‘గే మేరేజస్‌’ వరకూ వెళుతున్నారు. ఈ సందర్భంలో ‘లెస్బియన్‌’ అయిన అమ్మాయి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కేరీ చేసే కథ ఇది. దానిని తల్లిదండ్రులు ఎలా స్వీకరించారో హుందా అయిన చర్చ ద్వారా చూపించారు. కొన్ని విషయాలను మరుగున పెట్టి అనర్థాలు తెచ్చుకోవడం కన్నా వెలుతురులోకి తీసుకువచ్చి సక్రమైన మార్గం చూపడమే కాదు దానిని సమర్థించడం కూడా అవసరమే అని ఈ షార్ట్‌ఫిల్మ్‌ చెబుతుంది.

మరిన్ని వార్తలు