ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

15 Oct, 2018 01:32 IST|Sakshi

ఉత్తరం– షార్ట్‌ ఫిల్మ్‌
నిడివి 24 ని.04సె , హిట్స్‌ 91,283
ఉత్తరాలు పోయి ఈ మెయిల్స్‌ వచ్చాయి. ఈ మెయిల్స్‌ పోయి మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లు పోయి ఆ మెసేజ్‌ భాషలోని షార్ట్‌ కట్‌ మిగిలింది. థ్యాంక్యూ కి ’tq’. ఐ లవ్‌ యూ కి ’ILY’. లెట్‌ మి నో కు ’LMK’... ఇలా. ప్రేమ, అభిమానం, ఆప్యాయత... అన్నీ ఈ పొడి పొడి మాటల్లో ముక్కచెక్కలయ్యాయి. ఇవాళ మనసులోని భావాలను ఎదుటివారికి పరవడం లేదు. సరైన మాటల్లో మనసును తాకేలా నివేదించడం లేదు. ఉత్తరం రాయడం లేదు.

ఒట్టి మాటలతో, వాట్సాప్‌లతో బంధాలు ముడిపడతాయా? ‘ఉత్తరం’ షార్ట్‌ఫిల్మ్‌ ఒక తాతా మనవడిది. ఊళ్లో ఉన్న తాత– భార్యతో గొడవ పడి విడాకుల దాకా వెళ్లి సెలవు మీద ఊరు చేరుకున్న మనవడితో చేసే సంవాదం ఈ కథ. భార్య పట్ల మనసులో నిజంగా ఏముందో, ఎంత ప్రేముందో తెలియాలంటే కావలసింది మధ్యవర్తులు, పంచాయితీలు, వాదనలు కాదని మంచి ఉత్తరం అని తాత చెబుతాడు. ఆ మేరకు మనవడి చేత రాయిస్తాడు. ఆ ఉత్తరానికి ఎటువంటి స్పందన వచ్చిందనేది ముగింపు.

ఎల్‌.బి.శ్రీరామ్‌ సున్నితమైన అంశాలను తీసుకొని సాహిత్యం నుంచి ఎంపిక చేసుకున్న కథల ద్వారానో, లేదా సొంతంగా అల్లిన కథల ద్వారానో ఆకట్టుకునే షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తున్నారు. ఆ వరుసలో ఈ షార్ట్‌ఫిల్మ్‌ సామాజిక ప్రయోజనం కలిగినది అని చెప్పవచ్చు. ఇవాళ్టి తరానికి ఇటువంటి షార్ట్‌ఫిల్మ్స్‌ కొంత అవసరమే అనిపిస్తుంది. చిరాకులో ఉన్న దంపతులు తప్పక చూడాల్సిన ఫిల్మ్‌ ఇది. చక్కటి భాష, సంభాషణలు, దర్శకత్వం, లొకేషన్‌ ఉన్నాయి. ఎల్‌.బి.శ్రీరామ్, శర్మ లంక ముఖ్య పాత్రధారులు.


హలో గురూ ప్రేమ కోసమే – ట్రైలర్‌
నిడివి 2 ని. 1 సె. ,హిట్స్‌ 4,211,561
రామ్‌ సినిమాలలో ‘నేనూ శైలజా’ తర్వాత వచ్చిన ‘హైపర్‌’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వెంట వెంటనే హిట్స్‌ ఇవ్వడం, మార్కెట్‌లో డిమాండ్‌లో నిలవడం గ్లామర్‌ ప్రపంచంలో తప్పనిసరి. లేకుంటే ఈలోపు సమీకరణాలు మారిపోతాయి. హిట్స్‌ను బట్టి వేరే వేరే హీరోలొచ్చి స్లాట్స్‌ను తన్నుకుపోతారు. రామ్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెసిఫిక్‌ ఏరియా ఉంది. యాక్షన్‌ కామెడీ సినిమాలను అతను ఒక్క చేత్తో లాక్కురాగలడు.

లవ్‌ సబ్జెక్ట్స్‌ కూడా అతడికి మేచ్‌ అవుతాయి. అన్నీ సరిగ్గా కుదిరితే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లగలడు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా అతడికి అలాంటి అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. గతంలో ‘సినిమా చూపిస్తా మావా’, ‘నేను లోకల్‌’ సినిమాలు తీసిన త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. ప్రకాశ్‌ రాజ్‌ వంటి సీనియర్‌ నటుడు హీరో ఫ్రెండ్‌గా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేయడం ఫ్రెష్‌గా అనిపిస్తోంది. నిర్మాత దిల్‌ రాజు మెచ్చి తీసిన సినిమా అంటే ఏదో ఒక పాయింట్‌ ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో ఉంటుంది కనుక సినిమా కోసం ఎదురుచూడటమే తరువాయి.


హమీద్‌ –  ట్రైలర్‌
నిడివి 2 ని. 36 సె. ,హిట్స్‌ 1,562,977
కశ్మీర్‌ లోయ నేపథ్యంగా చాలా సినిమాలే వచ్చాయి. అక్కడ అలజడుల్లో మనుషులు అదృశ్యం కావడం సర్వ సాధారణం. కొడుకులు అదృశ్యం అయిన తల్లులు, భర్తలు అదృశ్యమైన భార్యలు అక్కడ వందల కొలదీ కనిపిస్తారు. జీవచ్ఛవాలుగా బతుకీడుస్తుంటారు. ఆ అదృశ్యమైనవారు బతికారో చనిపోయారో కూడా తెలియనిదుర్భర సందిగ్ధావస్థ. ఈ సినిమాలో ఎనిమిదేళ్ల హమీద్‌ అనే కుర్రాడి తండ్రి కూడా అదృశ్యమవుతాడు. తల్లి కుదేలవుతుంది. హమీద్‌కు ఈ విషయం దేవుడి దగ్గర నిలదీయాలనిపిస్తుంది.

‘786’ దేవుడి నంబర్‌ అని ఎవరో చెబుతారు. దానికి అటూ ఇటూ నంబర్‌ కలిపి హమీద్‌ డయల్‌ చేస్తాడు. అది కశ్మీర్‌లోనే విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడికి వెళుతుంది. అతడు తానే ‘అల్లా’ అని అతడితో సంభాషణలో దిగుతాడు. వాళ్లిద్దరూ తమ తమ జీవితాల నుంచి ఏమి తెలుసుకున్నది పరస్పరం ఏమి ఇచ్చుకున్నది ఈ సినిమా. ‘సారెగమ’ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఏజాజ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించాడు. బాల నటుడిగా నటించిన ‘తల్హా అర్షద్‌’ మనసును కట్టి పడేస్తాడు. ఎదురు చూడదగ్గ సినిమా.

మరిన్ని వార్తలు