ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

29 Oct, 2018 01:02 IST|Sakshi

భారతీయ రైల్‌ (షార్ట్‌ ఫిల్మ్‌– హిందీ)
నిడివి 14 ని.47సె , హిట్స్‌ 2,413,235
కంట నీరు కురువని వాడు రైల్లో ప్రయాణించనివాడు భారతదేశంలో ఉండడు. రైలెక్కాక ఒక మినీ భారతదేశమే రైల్లో ఉంటుంది. వంద రకాల మనుషులు, మనస్తత్వాలు, మంచితనాలు, తెలివిడి మొహాలు, కయ్యాలు, కొట్లాటలు, టికెట్టు లేని ప్రయాణికులు, బిచ్చగాళ్లు, సరుకులమ్మే వాళ్లు, హిజ్డాలు... రైలు మొదలయ్యి గమ్యం చేరే లోపల అనంతమైన కార్యకలాపాలు సాగుతాయి.

రైలునే జీవనాధారం చేసుకునేవారి మాట తీరు, జీవన నైపుణ్యం, లౌక్యం, దబాయింపు ఎవరూ మర్చిపోరు. రైలు చుట్టూ చాలా సాహిత్యం ఉంది. సినిమాలు ఉన్నాయి. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ భారతీయ రైల్వేలలో నిత్యం తారస పడే ఘటనలను చూపించి నవ్వు తెప్పిస్తుంది. టాయిలెట్స్‌ దగ్గర నడవడానికి కూడా చోటు లేకుండా ఆక్రమించుకుని పడుకుని ఉండేవారిని దాటుకుని వెళ్లడం ఎంత కష్టమో– మనకు తెలిసిందే– మళ్లొకసారి చూసుకుంటే గిలిగింత పుడుతుంది.

ఎవరో కుర్రాడు ట్రైన్‌ ఎక్కినప్పటి నుంచి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గంటలు గంటలు మాట్లాడి చంపుతుంటాడు. పేకాట ఆడేవాళ్లు, ఆస్తి మొత్తం టీసీకి రాసిచ్చైనా సరే బెర్త్‌ సంపాదించాలని తంటాలు పడేవాళ్లు, ఎదుటి వారికి అవసరం లేకపోయినా సలహాలు ఇచ్చేవాళ్లు... ఇండియాలో ఇంతే... ఇట్‌ హాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా అనిపిస్తుంది. ‘టి.వి.ఎఫ్‌’ వారి వీడియో ఇది. రైలును అభిమానించేవారు తప్పనిసరిగా చూడొచ్చు.

మొహల్లా అస్సి (హిందీ సినిమా ట్రైలర్‌)
నిడివి 2 ని. 31 సె. , హిట్స్‌ 9,476,593
కాశీ నగరం భారతీయ ఆధ్యాత్మికతలో అవిభాజ్యమైన నగరం. కాశీ ప్రమేయం లేని హైందవ ధర్మ వికాసం లేదు. శివ భక్తుల అంతిమ గమ్యస్థలి అది. అలాంటి నగరాన్ని రాజకీయ కారణాల రీత్యా, వ్యాపార కారణాల రీత్యా ఎలా కలుషితం చేస్తున్నారో చూప్తూ రచయిత కాశీనాథ్‌ సింగ్‌ ‘కాశీ కా అస్సి’ అనే నవల రాశారు. ‘అస్సి’ అంటే ఎక్కువగా విదేశీ టూరిస్టులు బస ఉండే కాశీలోని ఒక ఘాట్‌. ఆ నవల ఆధారంగానే ‘మొహల్లా అస్సి’ సినిమా తీశారు. అంటే ‘అస్సి చుట్టుపక్కల’ అని అర్థం.

ఇందులో సన్ని డియోల్‌ ఒక ‘పండా’గా నటించాడు. దొంగ గురువులు, సాధువులు, రామ మందిర వివాదం ఇవన్నీ కాశీ మీద ఎలాంటి ఫ్రభావం చూపాయో ఈ సినిమాలో చూడొచ్చు. సెన్సార్‌ కారణాల రీత్యా విడుదల ఆలస్యమైన ఈ సినిమా నవంబర్‌ 16న విడుదల కానుంది. ఒకప్పుడు టీవీలో ‘చాణక్య’ నవల ద్వారా పాపులర్‌ అయిన నటుడు చంద్రప్రకాష్‌ ద్వివేది ఈ సినిమా దర్శకుడు.

సవ్యసాచి (ట్రైలర్‌)
నిడివి 1 ని. 39 సె. ,హిట్స్‌ 4,121,951
చందు మొండేటి అకౌంట్‌లో ‘కార్తికేయ’, ‘ప్రేమమ్‌’ సినిమాల విజయం ఉంది. అతడి మూడో సినిమా ‘సవ్యసాచి’. ఈ టైటిల్‌ మహిమ ఏమో కాని ఎన్నో ఏళ్లుగా ఈ టైటిల్‌తో సినిమా తీయాలని చాలామంది ట్రై చేసి విఫలం అయ్యారు. చివరకు నాగ చైతన్యకు రాసి పెట్టి ఉంది. తమిళుల తరహాలో ‘హీరోకు ఒక చేయి అతని అదుపులో ఉండదు’ అనే పాయింట్‌ని తీసుకుని, తమిళుల తరహాలోనే ఒక విలన్‌ (మాధవన్‌)ను అనుకుని ఈ సినిమా తీసినట్టుగా అనిపిస్తోంది.

నవ్యత కోసం ప్రయత్నించారనడంలో సందేహం లేదు. భూమిక, నిధి అగర్వాల్‌ ఇతర ముఖ్య పాత్రలు. మైత్రీ మూవీస్‌ నిర్మాణం, కీరవాణి సంగీతం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్‌కు లాభించే అంశాలు. థ్రిల్లర్‌లు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. ఆ వరుసలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్‌ 2 విడుదల.

మరిన్ని వార్తలు