భారీ హీరోల టీజర్‌లకు షాకివ్వనున్న యూట్యూబ్‌!

13 Jan, 2020 19:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నచ్చిన హీరో కొత్త సినిమా స్టార్ట్‌ అయినప్పటీ నుంచి విడుదలయ్యేవరకు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా టీజర్‌, ట్రైలర్‌లు విడుదలైతే చాలు కొందరు వీరాభిమానులు వాటిని ఒకటికి పదిసార్లు చూస్తూ మురిసిపోతుంటారు. తమ హీరో ట్రైలర్‌కు భారీ వ్యూస్‌ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి.. హీరోలపై తమ అభిమానాన్ని చాటుకుంటారు. వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తారు. అయితే యూట్యూబ్‌లో అదేపనిగా అభిమాన హీరోల చిత్రాల టీజర్‌లు చూసేవారికి ఆ సంస్థ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్‌కు యూట్యూబ్‌ హెచ్చరిక జారీచేసింది. మీరు ఇప్పటికే 28,763 సార్లు ఈ వీడియోను చూసినందున్న.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌ ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. 

ఇకపై యూట్యూబ్‌లో ఒకే వీడియోను పదేపదే చూసేవారికి ఇదేరకమైన పరిస్థతి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌లో పెద్ద హీరోల సినిమాలకైతే కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ వస్తుంటాయి. ఒకవేళ యూట్యూబ్‌ ఈ నిబంధనను అమలు చేస్తే.. పెద్ద హీరోల సినీ టీజర్‌లకు షాక్‌ తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు