సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ ముందుంటారు

23 Oct, 2019 02:04 IST|Sakshi

‘‘వేదికపై ఉన్న అలీ, రఘుబాబు మా పార్టీలో (వైఎస్సార్‌సీపీ) ఉన్నారు. వారందరి సూచనలతో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి మా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిగారు సుముఖంగా ఉన్నారు’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డ్‌ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది.

రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రంలోని హీరోయిన్‌ ఇంట్రడక్షన్‌ ‘నారాయణతే నమో నమో..’ లిరికల్‌ వీడియో సాంగ్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్‌ రెడ్డి 20 ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు. వెంకటేశ్వర స్వామివారి కీర్తన పాటని నాతో ఎందుకు రిలీజ్‌ చేయించారో పాట చూశాక అర్థం అయింది. పాటని చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా పెద్ద  హిట్‌ అవుతుంది’’ అన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దైవం, పితృ సమానులు సుబ్బారెడ్డిగారితో నా అనుబంధం 20 ఏళ్లుగా కొనసాగుతోంది.

దివంగత నేత వై.యస్‌. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ కుటుంబానికి, పార్టీకి న్నెముకగా ఉండి ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డిగారు. యస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌) బోర్డ్‌ డైరెక్టర్‌ పదవీ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆయన నాపై పెట్టిన నమ్మకానికి నిజాయతీగా పని చేస్తా’’ అన్నారు. ‘‘రామానాయుడుగారు, ‘దిల్‌’ రాజుగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాస్‌ కానూరు. సంగీత దర్శకుడు రఘు కుంచె, పాటల రచయిత శ్రీమణి, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, ఎడిటర్‌ తమ్మిరాజు, నటుడు రవి ప్రకాష్, కెమెరామేన్‌ అంజి, లైన్‌ ప్రొడ్యూసర్‌ యమ్‌యస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా