'మా 'సినిమావాళ్ళవి' అద్దాలమేడ జీవితాలు'

26 Jul, 2017 11:28 IST|Sakshi
'మా 'సినిమావాళ్ళవి' అద్దాలమేడ జీవితాలు'

డ్రగ్స్ కేసు విషయంలో సినిమా వాళ్లపై వస్తున్న విమర్శలు, మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, వారికి కుటుంబాలు ఉంటాయని అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వైవియస్ చౌదరి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు.


'మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే,
మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే,
అస్సలు మేమేంచేసినా, చేయకున్నా ప్రతివాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే/స్పందిస్తూనే ఉంటాం.

ప్రతీ శుక్రవారం మా జీవనరేఖలు, జీవనసూత్రాలు, మా జీవితగమ్యాలు మారుతూనే ఉంటాయి. అలా ప్రతీ సంవత్సరంలో 52 సార్లు మార్పులకు, చేర్పులకు, కూర్పులకు అలవాటుపడ్డవాళ్ళం. ధైర్యసాహసాలను, కుట్రలూకుతంత్రాలను రచించగల/ప్రదర్శించగల కధానాయకులం, ప్రతినాయకులం. దానధర్మాలు, త్యాగాలు చేయగల మానవతావాదులం. మంచీ-చెడులు, గెలుపూ-ఓటమిలు, పొగడ్తలూ-ప్రశంసలు, నిందాపనిందలు మమ్మల్నెప్పుడూ వెంటాడే 'నీడ'లాంటి నేస్తాలు.

మేము అందరికీ కావాల్సినవాళ్ళం, మా అవసరాలకి మాత్రం అందరికీ కానివాళ్ళం. ఏ మాధ్యమాలకైనా, ఏ విషయానికైనా మేమే అవసరం, మేమే ప్రథములం. మేము 'అల'లాంటి వాళ్ళం. 'అల'లాగా నిశ్చింతగా నిశ్చళంగా బతకడం చేతకానివాళ్ళం. కానీ, 'అల'లాగా పడినా లేవగల సత్తా ఉన్నవాళ్ళం. మేము దేనినైనా స్వీకరించగలం, దేనినైనా భరించగలం. దేనికైనా వెనకాడని దమ్ముగలవాళ్ళం.

ఎంత మంది ఎన్ని అన్నా, అనకున్నా 'కళ' పట్ల, 'కళాకారుల' పట్ల వ్యామోహాన్ని ఆపలేరు, 'కళాకారులు' లోని తృష్ణని తగ్గించలేరు. ప్రపంచం ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతుకుతుంది తప్ప, గతాన్ని గుర్తుకు తెచ్చుకునే ఓపికా ఉండదు, భవిష్యత్తు గురించి బెంగపడే తీరికా ఉండదు. కాలప్రవాహంలో ఇప్పడు సంచరిస్తున్న వార్తలన్నీ రేపటికి సద్దికూడు. ఎల్లుండికి విసిరేసిన విస్తరాకు. క్లుప్తంగా.. ఈ వర్తమానమంతా రేపటికి ఇంగువ కలిపిన కమ్మని పులిహోర (Exaggerated News), ఎల్లుండికి అందరూ వదిలించుకుందామనే అశుద్ధం.

PS: ఇప్పుడు తెలుగు 'వెండితెర'పై కమ్మిన కారుమబ్బుల గురించి, నా ఈ గోడు మీ అందరికీ అర్ధమయ్యుంటుందని ఆశిస్తూ.. మీ.. వై వి ఎస్ చౌదరి.' అంటూ ప్రకటనను విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా