‘ఛీఛీ’ రోడ్లు..!

9 Feb, 2018 16:05 IST|Sakshi
గాంధీనగర్‌లో సీసీరోడ్డు లేని వీధి

మండలంలోని పలు గ్రామాల్లో గతుకుల రోడ్లు

ఇబ్బందులు పడుతున్న పల్లె ప్రజలు

పెంట్లవెల్లి : మండలంలోని ఎంగంపల్లి, మంచాలకట్ట, మాధవస్వామినగర్, కొండూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు తిరిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ గ్రామాల్లో సీసీరోడ్లు మాత్రం ఇప్పటికీ వేయడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికాలనీలో సీసీరోడ్లు వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వేయలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. 

అప్పుడిప్పుడంటూ కాలయాపన 
సీసీరోడ్లు నిర్మిస్తే ప్రయాణికులకు, గ్రామస్తులకు ఇబ్బందులు తొలగుతాయని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరితే మంజూరవుతాయి.. అప్పుడిప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని.. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. రోడ్లు వేయలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభలలో ఎన్నో హామీలిస్తారు కానీ ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతా చోట్ల న్యాయం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కాలనీల్లో సీసీరోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సీసీరోడ్లు నిర్మించండి 
మాధవస్వామినగర్‌లో సీసీరోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రివేళ మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. సర్పంచ్, అధికారులు స్పందించి సీసీరోడ్డు నిర్మించేలా చూడాలి. 
– రాజేందర్, మాధవస్వామినగర్‌ 

ఏళ్లు గడుస్తున్నా.. 
మల్లేశ్వరం గ్రామంలో ఎన్నికల ముందు పలు హామీలిచ్చిన నాయకులు ప్రస్తుతం అడిగితే మాట మారుస్తున్నారు. ఇప్పటికైనా మా కాలనీల్లో సీసీ రోడ్ల కల నెరవేర్చాలి. 
– కుర్మయ్య, మల్లేశ్వరం 

మరిన్ని వార్తలు