శిశుగృహ.. పాపాలపుట్ట 

5 Jan, 2018 10:44 IST|Sakshi

తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతోనే మృతిచెందారని ప్రచారం

శిశుగృహలో చేరేనాటికి పిల్లల బరువు రెండు కేజీల పైమాటే

పౌష్టికాహార లోపంతో బరువు కోల్పోయిన చిన్నారులు

టెట్రాపాలు వికటించడంతో మరింత క్షీణించిన ఆరోగ్యం 

ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడి మృత్యుఒడికి చేరిన వైనం

శ్రీజ..ఈ చిన్నారి శిశుగృహలో గత ఏడాది ఆగస్టు 24న చేరింది. అప్పుడు ఆమె బరువు 2.9 కేజీలు..అదే నెల ఆస్పత్రిలో చేర్పించినప్పుడు 2.580 కేజీలు. అంటే 32 గ్రాములు తగ్గింది. ఈ చిన్నారి అదే ఏడాది అక్టోబర్‌ 21న చనిపోయింది. మిగతా చిన్నారులందరూ శిశుగృహలో చేరినప్పుడు బరువు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత పోషకాహారలోపంతోనే బరువు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి.

సాక్షి, నల్లగొండ : అనాథ శిశువులను అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించాల్సిన శిశుగృహ.. పాపాల పుట్టను తలపిస్తోంది. ముక్కుపచ్చలారని పసిమొగ్గలను పొట్టనపెట్టుకుంది. ‘పౌష్టికాహార లోపమే’ అన్న కఠోర వాస్తవాలను బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా మాయమాటలతో కప్పేస్తున్నారు. పాపపుణ్యాలు ఎరుగని 14 మంది చిన్నారులు మృతిచెందడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదు. చనిపోయిన పిల్లలు బరువు తక్కువ ఉన్నారని, అప్పుడే పుట్టిన పిల్లలకు ముర్రుపాలు పట్టించకుండా శిశుగృహలో వదిలేస్తున్నారని విషపు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి శిశుగృహలో చేర్పిస్తున్న పిల్లల బరువు రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాతే వారి సంరక్షణ చర్యలు చేపడుతారు. 

ఈ విధంగా చనిపోయిన 14 మంది పిల్లల బరువు శిశుగృహలో చేర్పించేనాటికే రెండు కేజీలు పైబడి ఉన్నారు. ఒకరిద్దరు మినహా పిల్లలందరూ రెండు కేజీలు దాటి ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా చోటుచేసుకోని వరుస మరణాలు ఆకస్మికంగా ఎందుకు జరిగాయా అనే కోణంలో ఆరాతీస్తే మాత్రం పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్నేళ్లుగా అపోలో ఫార్మా నుంచి సరఫరా అవుతున్న జీరోలాక్ట్, లాక్టోజన్‌ వంటి పాల డబ్బాలను వినియోగించిన అధికారులు ఉన్నపళంగా బంద్‌ చేశారు. ఆరు మాసాలు దాటిన పిల్లలకు వాడే సుప్రబాత్‌ టెట్రాపాల ప్యాకెట్లను ప్రయోగించారు. దీంతో శిశువుల ఆరోగ్యం క్షీణించి బరువు కోల్పోయారు.

పిల్లలకు టెట్రాపాలు వాడాలని అధికారులే లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. వైద్యుల సలహాలను పాటించకపోవడం, తరచూ వైద్యులను మార్చడం, పిల్లలు చనిపోతున్న విషయాన్ని ఉన్నతాధికారుల వరకు వెళ్లనివ్వకుండా ఏకపక్ష నిర్ణయాలతో పిల్లల ప్రాణాలు తీశారు. మరణాలకు సంబంధించి అధికారులు చేస్తున్న ప్రచారానికి, శిశుగృహలో పిల్లలను చేర్పించేనాటికి రికార్డుల్లో నమోదైన 11మంది పిల్లల బరువు వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. పౌష్టికాహారం నిలిపేసి, టెట్రాపాలు పట్టించడంతో అనారోగ్యానికి గురైన పిల్లలను వివిధ ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించి బరువు కోల్పోయిన చిన్నారులు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడి చివరకు మృత్యుఒడిలో చేరారు.

Read latest Nalgonda News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా