నెత్తురోడిన రహదారులు

18 Jan, 2018 10:15 IST|Sakshi

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

మరో ఇద్దరికి గాయాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘటనలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు నెత్తురోడాయి.. మితిమీరిన వేగం.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. బుధవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.

మునగాల(కోదాడ): పెన్‌పహాడ్‌ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన నాగిరెడ్డి అన్వేష్‌రెడ్డి(27) కొన్నేళ్లుగా అమ్మమ్మగారి ఊరైన చివ్వెల మండలం గుంపులలో ఉంటున్నాడు. మృతుడికి వివాహం విడాకులు తీసుకున్నట్టు సమాచారం.కాగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న అన్వేష్‌రెడ్డి బుధవారం గుంపుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీకాంత్‌రెడ్డితో ద్విచక్రవాహనంపై మండలంలోని కలకోవ గ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో బైక్‌ అదుపుతప్పి రహదారి ప్రక్కన పడిపోయారు. ఈ ప్రమాదంలో అన్వేష్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చొని ఉన్న శ్రీకాంత్‌రెడ్డి స్వల్ప గాయలతో బయటపడ్డాడు. ఇతడిని 108వాహనంలో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం అన్వేష్‌రెడ్డి మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

టిప్పర్‌ ఢీకొని వృద్ధురాలు..
వేములపల్లి (మిర్యాలగూడ) : నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై  గంగదేవమ్మగుట్ట సమీపంలో వేములపల్లి నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న టిప్పర్‌ నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. వృద్ధురాలికి సుమారు 65సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

ట్రాక్టర్‌పైనుంచి కిందపడి యువకుడు..
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బింగి వెంకటేశంకు ముగు ్గరు కుమారులు. వీరిలో రెండో కుమారుడైన బింగి బాలకృష్ణ(16) ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసి, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగాలేక చదువును మధ్యలో మానేశాడు. ఈ క్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ ఎర్రవోల శ్రీనివాస్‌ వద్ద ఆరు నెలల క్రితం టెంపరరీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిలో కుదిరాడు. బుధవారం స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న ఇంద్రియాల గ్రామానికి వెళ్లి ట్రాక్టర్‌కు మరమ్మతు చేయించాడు.  తిరిగి ఇంటికి వస్తుండగా గ్రామశివారులో తోటి స్నేహితుడు ట్రాక్టర్‌ నడిపిస్తానని చెప్పడంతో సీటులోంచి లేచాడు. అంతలోనే ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి జారి కింద పడ్డాడు. దాంతో ట్రాక్టర్‌ ఇతనిపై నుంచి వెళ్లడంతో బాలకృష్ణ అక్కడకక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ రాఘవేంద్రగౌడ్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. చేతికందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

డివైడర్‌పై కారు దూసుకుపోవడంతో..
భువనగిరిఅర్బన్‌ :  హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌కు చెందిన అరవింద్‌గౌడ్‌(22), సనత్‌నగర్‌కు చెందిన అత్మజమిశ్ర స్నేహితులు. ఇద్దరు కలిసి బుధవారం భువనగిరికి కారులో వచ్చారు. భువనగిరి ఖిలాను సందర్శించారు. అనంతరం వరంగల్‌ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వీరి కారు డివైడర్‌పైకి దూసుకుపోయింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కారులో డ్రైవింగ్‌ చేస్తున్న అరవింద్‌గౌడ్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్మజమిశ్రకు చేతికి, కాలుకు గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అరవింద్‌గౌడ్‌ ట్యాటు సెంటర్‌లో పనిచేస్తునట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

స్కూల్‌ బస్‌ ఢీకొని మాజీ సర్పంచ్‌..
అనంతగిరి (కోదాడ) : మండలంలోని పాలారం తండాకు చెందిన మాజీ సర్పంచ్‌ భూక్యా కోట్యానాక్‌ (48) ఉదయం బైక్‌పై వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో  చనుపల్లి నుంచి వస్తున్న ఎస్‌ఆర్‌ఎం ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఎదురుగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ అదుపుతప్పి కోట్యా నాయక్‌ కిందపడ్డాడు. బస్సు ముందు చక్రం అతడితలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య భూక్యా మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథరెడ్డి తెలిపారు.


డీసీఎం ఢీకొని మరొకరు..
చౌటుప్పల్‌ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తుర్కయంజాల్‌ గ్రామానికి చెందిన ఏరువ బాల్‌రెడ్డి(43) కొన్నేళ్లుగా నారాయణపురం మండల కేంద్రానికి దతుకుదెరువుకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. భార్య ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా బాల్‌రెడ్డి హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. రోజువారీగా పనికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు తంగడపల్లి జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో విజయవాడ వైపునకు వెళ్లే డీసీఎం వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని వృద్ధుడు..
నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రం గొల్లగూడెంలో నివాసం ఉం టున్న సముద్రాల పెద్దులు (50) బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో లెప్రసీకాలనీ వద్ద నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిని దాటుతుండగా మిర్యాలగూడ నుంచి నార్కట్‌పల్లివైపు వెళ్తున్న కారు ఢీకొ ట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ గోపిని పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుం బ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్‌ ఎస్‌ఐ మధు తెలిపారు.

>
మరిన్ని వార్తలు