తప్పుల తడకగా ఓటరు లిస్టు

5 Mar, 2018 08:45 IST|Sakshi

కలెక్టర్‌ స్పందించి సరిచేయాలి

ఏప్రిల్‌ 15 వరకు సాగర్‌నీరు విడుదల చేయాలి

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ అర్బన్‌ : ఎన్నికల ఆధికారుల ఆదేశానుసారం తయారు చేసిన ఓటరు లిస్టు తప్పుల తడకకగా ఉందని మాజీ ఎమ్మెల్యే, సీపీఎ రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక చోట కూర్చొని ఓటరు లిస్టు తయారు చేసినట్లుగా ఉందని, ఒక గ్రామానికి చెందిన ఓట్లు మరో గ్రామంలో ఉన్నాయని అన్నారు. మండలంలోని కాల్వపల్లి, తడకమళ్ల గ్రామ పంచాయతీ దుబ్బతండా తదితర ఓట్లు ఇతర మండలాల్లో కూడా నమోదు చేశారని తెలిపారు.

ఇలాంటి తప్పుల తడకగా ఉన్న ఓటరు లిస్టు ఆధారంగా ఎన్నికల సమయంలో ప్రజలు ఓటు ఎలా వేస్తారని అన్నారు. పారదర్శకంగా తయారు కావాల్సిన ఓటరులిస్టు ఇలా లోపబుయిష్టంగా మారడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి ఓటరులిస్టులో జరిగిన అవకతవకలను గుర్తించి సరిచేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం సాగర్‌ కాల్వకింద సాగు చేసిన వరిపంట పొట్టదశలో వుందని.. ఏప్రిల్‌ 15వ తేదీ వరకు సాగర్‌నీటిని విడుదల చేయాలని కోరారు. పంటలు చేతికొచ్చే సమయానికి మద్దతు ధరను అందించేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం అందించే బోనస్‌కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్‌ ఇవ్వాలని కోరారు.

 రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని కౌలురైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 20లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు మల్లు గౌతంరెడ్డి, రెమడాల పరశురాములు, ఖమ్మంపాటి శంకర్‌ తదితరులున్నారు. 

Read latest Nalgonda News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా