మేమొస్తున్నామని డ్రామా చేశారా?

4 Jan, 2018 12:38 IST|Sakshi

పది రోజుల్లో మళ్లీ వస్తా..

నర్సరీల్లో మొక్కలన్నీ బతకాలి

అధికారులపై హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ ఆగ్రహం

గాగిళ్లాపురం, కోరుట్లలో వననర్సరీల పరిశీలన  

చందంపేట(దేవరకొండ): ‘నర్సరీలపై ఇంత నిర్లక్ష్యమా? మేము వస్తున్నామని ఎక్కడి నుంచో మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారా? డ్రామా చేస్తున్నారా? బుర్ర పనిచేయడం లేదా? పది రోజుల్లో మళ్లీ వస్తా.. నర్సరీల్లోని మొక్కలన్నీ బతకాలి..’ అంటూ తెలంగాణకు హరితహారం కార్యక్రమ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం గాగిళ్లాపురం, కోరుట్ల గ్రామాల్లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన నర్సరీలను నల్లగొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌తో కలిసి ఆమె పరిశీలించారు. వన నర్సరీల పెంపకంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. తాము వస్తున్నట్లు సమాచారం మేరకు తాత్కాలికంగా కొన్ని మొక్కలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు.

ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, మట్టి నమూనాలు లేకుండా మొక్కలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. మొక్కల సంరక్షణకు పంపిణీ చేసిన నెట్‌లను కూడా ఏర్పాటు చేయకపోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. మండలంలో ఉన్న నర్సరీల్లో గ్లీనరీ కనిపించాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ప్రతి మొక్క బతకాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవుల శాతాన్ని 30 శాతం పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యంతో ఉందన్నారు. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో వంద కోట్లు, సామాజిక అడవుల కింద 120 కోట్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

రూ.80 కోట్ల నిధులు ఉన్నాయి : కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌
నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 80 కోట్ల నిధులున్నాయని నల్లగొండ కలెక్టర్‌ ఉప్పల్‌ తెలిపారు. నర్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి 5 నెలలుగా వేతనాలు అందకపోవడంతో నర్సరీలో పనులకు రావడం లేదని కూలీలు కలెక్టర్‌కు తెలిపారు. వేతనాలు రేపటిలోగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శాంతారాం, ఆర్డీఓ లింగ్యానాయక్, ఎఫ్‌డీ లోవు సుదర్శన్‌రెడ్డి, జి.రవి, ఎఫ్‌ఆర్వో సర్వేశ్వర్, ఇన్‌చార్జ్‌ ఎంఈఓ శంకర్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ శ్రీనివాస్, శేఖర్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు