వైకుంఠ నారాయణుడిగా లక్ష్మీ నారసింహుడు

22 Jan, 2018 11:44 IST|Sakshi

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని పాతగుట్టలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి అమ్మవార్లు వైకుంఠ నారాయణుడిగా అలంకారం చేసి ఊరేగించారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేసి ప్రత్యేక సేవలో ఆలయ తిరువీధులలో ఊరేగించారు.

ఆలయంలో విశేష పూజలు
స్వామి అమ్మవార్ల ప్రధానాలాయం బాలాలయంలో ఉదయం నిత్య కైంకర్యాలను నిర్వహించి ఆరాధన, బాల భోగం, వంటి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్ధం ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ నరసింహామూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆస్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, సురేంద్రాచార్యులు, గట్టు వెంకటాచార్యులు, ఆలయ అధికారులు దోర్భల భాస్కర శర్మ, మేడి శివకుమార్‌ పాల్గొన్నారు.

భక్తజన క్షేత్రం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం భక్తులతో కిటకిట లాడింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, గర్భాలయం తదితర ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. కొండపైకి వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో వాహన పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి 5 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

మరిన్ని వార్తలు