150 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

22 Jan, 2018 11:42 IST|Sakshi

తుంగపహాడ్‌ నుంచి లారీలో అక్రమంగా తరలింపు

విశ్వసనీయ సమాచారం మేరకు కాపుకాచి పట్టుకున్న పోలీసులు

నలుగురి అరెస్ట్‌.. పరారీలో మరో ఇద్దరు

వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌

మిర్యాలగూడ రూరల్‌: లారీలో అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని మిర్యాలగూడ రూరల్‌ సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐ కుంట శ్రీకాంత్‌ ఆదివారం పట్టణ పరిధిలో పట్టుకున్నారు. వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ శ్రీని వాస్‌ విలేకరులకు వెల్లడించారు. తుంగపహాడ్‌ నుంచి రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో తెల్లవారుజామున 4:30 గంటలకు రూరల్‌ సీఐ, ఎస్‌ఐ నాగార్జునసాగర్‌ రోడ్డుపై తుంగపహాడ్‌ వద్ద కాపుకాచి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం లారీడ్రైవర్‌ చెన్నపల్లి వెంకన్నను విచారించగా బియ్యానికి సంబంధించిన వ్యక్తులు వివరాలు వెల్లడిం చినట్లు తెలిపారు.

బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన నిందితులు బి.అన్నారం గ్రామానికి చెందిన చేదెళ్ల రాజు, అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన బాల్స కృష్ణమూర్తి, దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన జానకి రెడ్డి, అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన డీలర్‌ గందె నాగేశ్వర్‌రావు, మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్‌ (లారీ ఓనర్‌)లు గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి వాస శ్రీనివాస్‌కు అమ్మినట్టు వెల్లడించారు. నిందితుల్లో నలుగురు రాజు, వెంకన్న, కృష్ణమూర్తి, నాగేశ్వర్‌రావులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు వాస శ్రీనివాస్, జానకిరెడ్డిలు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. పట్టుబడిన లారీని సీజ్‌ చేశామని, పంచనామా నిర్వహించి నిబంధనల ప్రకారం నిందితులను, బియ్యాన్ని కోర్డుకు అప్పగించనున్నట్టు వివరించారు.

పకడ్బందీగా ప్రజాభద్రత చట్టం అమలు
అక్రమాలను అరికట్టేందుకు డీఐజీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో ప్రజల భద్రతకు విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణంలో 150, లారీ అసోసియేషన్‌ వద్ద 20, శ్రీనివాస్‌నగర్‌లో 14, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 30, వేములపల్లిలో 20, హాలియా, నాగార్జునసాగర్‌లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ ఎ.రమేష్‌ బాబు, ఎస్‌ఐ కుంట శ్రీకాంత్, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది గౌస్, రవి కుమార్, సాముల్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు