మార్కెట్‌లో విజిలెన్స్‌ తనిఖీలు

10 Jan, 2018 12:05 IST|Sakshi

హాలియా (నాగార్జునసాగర్‌) : హాలియా మార్కెట్‌ యార్డులో మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్‌ యార్డులోని వాణిజ్య సముదాయం గోడౌన్లలో కొంతమంది ట్రేడర్లు సుమారు రెండు వేల బస్తాల కందులు అక్రమ నిల్వలు ఉంచారనే ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ కేసీ ప్రమీల, విజిలెన్స్‌ ఎస్‌ఐ గౌస్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యాపారులు కర్ణాటక గుల్భార్గా ప్రాంతం నుంచి కందులు కొనుగోలు చేసి మార్కెట్‌ యార్డులోని గోడౌన్‌లలో నిల్వ ఉంచారు.

యార్డులో మొత్తం 13 దుకాణాలు ఉండగా 8 దుకాణాల్లో తనిఖీ చేయగా మూడు దుకాణాల్లో కందులు నిల్వలు బిల్లులు, స్టాక్‌ రిజిష్టర్లు తనిఖీ చేశారు. కాగా మిగిలిన దుకాణాల వ్యాపారులు స్థానికంగా లేకపోవడంతో బుధవారం తనిఖీలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు దుకాణాలకు సీల్‌ వేశారు. వ్యాపారులు అక్కడ రైతుల వద్ద కొనుగోలు చేశారా? లేక మధ్యవర్తి వద్దనా అన్న పూర్తి వివరాలు బుధవారం తేలే అవకాశం ఉంది. తనిఖీల్లో మార్కెట్‌ కార్యదర్శి శ్రీనాథరాజు రెవెన్యూ కార్యదర్శి శ్యాం పలువురు అధికారులు ఉన్నారు. మార్కెట్‌లో త్వరలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు నిల్వ చేసిన కందులపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

మరిన్ని వార్తలు