ఇరుకు వంతెనతో ఇక్కట్లు

12 Mar, 2019 12:47 IST|Sakshi
ఇరుకుగా ఉన్న వంతెనపై వెళ్తున్న వాహనం, వంతెనపై ఇరుక్కున్న బస్సులు

సాక్షి,నల్లగొండ : పెద్దవూర మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో నాగార్జునసాగర్‌– హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న ఇరుకు వంతెనతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నాగార్జునసాగర్‌ ప్రపంచ పర్యాటక కేంద్రం కావడం, హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలిపే ప్రధాన రహదారి ఇదే కావడం,  అదీగాక మిర్యాలగూడెం పరిసర ప్రాంతాలలో రైస్‌ మిల్లులు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు అధిక సంఖ్యలో ఉండటంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. ఇరురాష్ట్రాలకు చెందిన వీఐపీలు సైతం ఈ రోడ్డు మార్గాన పోవాల్సిందే. రహదారి ఇరుకుగా ఉండి కేవలం ఒక్క వాహనం మాత్రమే వెళ్లటానికి వీలు ఉంది. దీంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు వంతెన అవతలి వైపు ఉన్న వాహనాలు నిలుపు కోవాల్సిందే.

ఒకే వాహనం పోవటానికి వీలు అవుతుండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయి. రెండు వాహనాలు వంతెనపైకి వచ్చి ఇరుక్కు పోయిన సందర్భాలు కోకొల్లలు. ఆ సమయంలో వాహనాలు వంతెన నుంచి రాలేక గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయిన దాఖలాలు ఉన్నాయి. వంతెన సమీపంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయాలలో లైట్ల వెలుతురులో వంతెన ఉన్నట్లు డ్రైవర్‌లకు కనపడక వాహనాలు ఢీ కొన్న పరిస్థితులు ఉన్నాయి. వంతెనపై ఇరువైపులా కంపచెట్లు మొలవడంతో పాటు రెండు అడుగుల వెడల్పులో ఇసుక పేరుకుపోయింది.

వాహనాలు ఎదురుగా వస్తున్నప్పుడు ద్వి చక్రవాహనాలు ఆ ఇసుకలో స్లిప్‌ అయ్యి కింద పడి గాయాల  పాలవుతున్నారు.  రెండేళ్ల కిందట మండలంలోని నాయినివానికుంట గ్రామానికి చెందిన జానపాటి లింగమ్మ వంతెనపై నడుచుకుంటు వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీ కొనడంతో ఆమె మృతి చెందింది. కృష్ణా తాగునీటి నల్లా పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉండటంతో గ్రామస్తులు తాగు నీటి కోసం ఇరుకు వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటారు. వంతెనపై నడిచి వెళ్లేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు  భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రస్తుతం జడ్చర్ల–కోదాడ వరకు జాతీయ రహదారి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనైనా ఇరుకు వంతెనకు మోక్షం కలుగుతుందేమో చూడాలి మరి. అధికారులు స్పందించి నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఉన్న ఇరుకు వంతెనను వెడల్పు చేసి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి
ఇరుకు వంతెనపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వంతెనపై రెండు వైపులా రెయిలింగ్‌కు మూడు నాలుగు అడుగుల వెడల్పులో ఇసుక ఉంది. దీనిపై బైక్‌లు స్లిప్‌ అయ్యి కింద పడి గాయాలపాలవుతున్నారు. ఒకే వాహనం పోవడానికి వీలుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది.  అధికారులు స్పందించి వంతెనను వెడల్పు చేయాలి.

– కిలారి మురళీయాదవ్, పెద్దవూర 

మరిన్ని వార్తలు