యాదాద్రిలో గాడి తప్పిన పాలన..!

9 Jan, 2018 15:27 IST|Sakshi

విధి నిర్వహణలో అధికారుల అలసత్వం

విశ్రాంత ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ

తప్పులు జరుగుతున్నా పట్టించుకోని ఉన్నత యంత్రాంగం

యాదాద్రి దేవస్థానంలో పాలన గాడి తప్పింది. తప్పులపై తప్పులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రిటైర్డ్‌ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావడం అధికారుల అలసత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో అధికారుల పనితీరును చూసి భక్తులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

యాదగిరికొండ (ఆలేరు) : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. కోట్లు వెచ్చించి ఆలయాన్ని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడి అధికార యంత్రాంగం మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఉద్యోగ విరమణ పొందినా..
దేవస్థానంలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి గత సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందాడు. అయితే సంబంధిత సెక్షన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రిటైర్డ్‌ ఉద్యోగి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రెండు నెలల వేతనం జమ అయ్యింది. ఇటీవల గుర్తించిన సదరు విభాగం అధికారులు సదరు రిటైర్డ్‌ ఉద్యోగిని పిలిపించి వేతన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా అతడు నిరాకరించడంతో విషయం కాస్తా బయటికి పొక్కింది.

గతంలోనూ..
ఇలాంటి ఘటనలు దేవస్థానంలో కొత్తేమి కాదని గత రికార్డులు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. గతంలో దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేసిన ఉద్యోగి ఖాతాలో కూడా ఆరు నెలల వేతనం జమ అయింది. అదే విధంగా మరో ఉద్యోగికి అదనంగా ఇంక్రిమెంట్‌ కలిపిన ఘటనలు దేవస్థానంలో వెలుగుచూశాయి. అయినా కూడా సదరు విభాగం అధికారుల తీరులో మాత్రం నిర్లక్ష్యం ఇంకా కనిపిస్తోందని తాజా ఘటనే రుజువు చేస్తోంది.

ఏళ్లకు ఏళ్లుగా..
సహజంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు బదిలీలు సహజం. మహా అయితే మూడు, నాలుగు సంవత్సరాలకు ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. కానీ, దేవస్థానంలో ఓ స్థాయి ఉద్యోగి మాత్రం ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. కిందిస్థాయిలో ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలిసిపోతోంది. ప్రసిద్ధ ఆలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కాగా, దేవస్థానంలో వెలుగుచూసిన ఘటనలపై వివరణ కోరేందుకు ఆలయ ఈఓ పలుమార్లు ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదు. 

మరిన్ని వార్తలు