ఎర్రబెల్లి జాతర షురూ..

5 Mar, 2018 08:41 IST|Sakshi

మందగంప, తల్లిగంప సమర్పించిన భక్తులు

నిడమనూరు : ఎర్రబెల్లి లింగమంతుల జాతర శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. గ్రామస్తుల మందగంప సమర్పణతో జాతరకు శ్రీకారం చుట్టారు. శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు జాతర సాగుతుంది. ఆదివారం రాత్రి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తల్లిగంపను తెస్తారు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన అన్ని కులాలకు చెందిన ప్రజలు మందగంపను దేవతకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ మన్నెం లింగయ్యయాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు.

తల్లిగంప సమర్పణ..
లింగమంతులస్వామి జాతరలో భాగంగా రెండో రోజు ఆదివారం రాత్రి తల్లి గంపను సమర్పించారు. మందగంపను ఎర్రబెల్లి గ్రామస్తులు మాత్రమే తెస్తారు. కానీ తల్లిగంపను ఇతర గ్రామాలకు చెందిన చెంచు కులానికి చెందిన భక్తులు తెచ్చి మాణిక్యాలదేవికి సమర్పిస్తారు.

జాతర వద్ద భక్తుల సందడి..
జాతర సందర్భంగా యాదవులు గజ్జెల లాగులు, చేతిలో కత్తులు(అవసరాలు)తో విన్యాసాలు చేశారు. పలువురు అవసరాల తయారీ, పాత వాటిని కొత్తగా చేయడం, వంటి పనిలో నిమగ్నమయ్యారు. జాతర సందర్భంగా గుట్ట వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తుంది.

పోలీస్‌ బందోబస్తు..
జాతర సందర్భంగా.. ఏఎస్‌ఐ లతీఫ్‌బాబా ఆధ్వర్యంలో జాతర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు మహిళా కానిస్టేబుల్, హోంగార్డులు సైతం విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం సీఐ, నలుగురు ఎస్‌ఐలతో పాటు మొత్తం 80మంది బందోబస్తు నిర్వహించనున్నారు.

Read latest Nalgonda News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా