దర్యాప్తు సంస్థలు కంప్యూటర్‌లోకి చొరబడవచ్చు

21 Dec, 2018 14:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు సరికొత్త అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ కంప్యూటర్‌నైనా క్షుణంగా పరిశీలించే అధికారాన్ని పలు దర్యాప్తు సంస్థలకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పది దర్యాప్తు సంస్థలకు ఈ నిబంధనలు వర్తింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా గురువారం సంతకం చేశారు. వీటిలో సీబీఐ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, నార్కో కంట్రోల్‌ బ్యూరో, ఈడీ, సీబీడీటీ, డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ, రా, డీఎస్‌ఐ, ఢిల్లీ పోలీసులకు ఈ కొత్త అధికారాన్ని కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కంప్యూటర్‌లోని సమాచారాన్ని, మెయిళ్లను, డేటాను పరిశీలించే అధికారం ఆయా దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా మెయిళ్లను అడ్డుకునే, పర్యవేక్షించే అధికారం కూడా దర్యాప్తు సంస్థలకు కల్పించబడింది. గతంలో దర్యాప్తు సంస్థలకు వాడుకలో ఉన్న డేటాను మాత్రమే నియంత్రించే అధికారం ఉండేది.

దర్యాప్తు సంస్థలకు కొత్త అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడుతున్నాయి. కేంద్రం బిగ్‌ బ్రదర్‌లా అన్నింట్లో వేలు పెట్టే ప్రయత్నం చేస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఇది భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారాలు దుర్వినియోగం కావని కేంద్రం చెప్పగలదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం అవసరం ఈ అపరమిత అధికారం ఇప్పుడెందుకని నిలదీస్తున్నారు.

మరిన్ని వార్తలు