మోదీ వర్సెస్‌ 10

14 Nov, 2018 00:52 IST|Sakshi

ప్రధానికి రజనీకాంత్‌ బాసట

చెన్నై: బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా మాట్లాడారు. ‘ఒక వ్యక్తి (మోదీ)కి వ్యతిరేకంగా పది మంది వెళ్తున్నారు అంటే ఎవరు బలవంతులు? ఆ పది మందా లేక వారికి ఎదురుగా ఉన్న ఒక్కడా? పది మంది కలిసి ఒక్కరిపై యుద్ధం ప్రకటిస్తే ఎవరు బలవంతుడని అర్థం?’ అని రజనీకాంత్‌ మంగళవారం అన్నారు. నోట్లరద్దు నిర్ణయం సరైనది కాదనీ, కనీసం సరిగ్గా అమలవ్వలేదని విమర్శించారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనే అర్థం వచ్చేలా సోమవారం తాను చేసిన వ్యాఖ్యలపై కూడా రజనీ తాజాగా వివరణ ఇచ్చారు. ‘బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని విపక్షాలు అనుకుంటున్నాయి.

కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు బీజేపీ ప్రమాదకరమైనదేనని నేను అన్నాను. అయితే ఈ మాటలు మరోలా అర్థమై, బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని నేనే అన్నట్లుగా వార్తలొచ్చాయి’ అని తెలిపారు. బీజేపీ నిజంగా ప్రమాదకర పార్టీయో కాదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్‌కు బీజేపీ అనుకూలుడిగా పేరుండటం తెలిసిందే. ‘బీజేపీ దారిలోనే మీరు నడుస్తారా?’ అని రజనీని ప్రశ్నించగా అది భవిష్యత్తులో నిర్ణయమవుతుందన్నారు. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులపై తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ ‘ఆ ఏడుగురు ఎవరో తెలియనంత తెలివితక్కువ వ్యక్తి కాదు రజనీకాంత్‌. ఆ రోజు  విలేకరి ప్రశ్న స్పష్టంగా అడగకుండా ఊరికే ఏడుగురిని విడుదల చేయాలన్న డిమాండ్‌పై స్పందనేంటన్నారు. అతని తప్పును సరిచేసేందుకు నేను ఏ ఏడుగురు? అని ప్రశ్నించాను. దీంతో నాకు ఈ విషయం గురించి ఏమీ తెలీదంటూ కొందరు ప్రచా రం మొదలుపెట్టారు’ అని చెప్పారు. 

మరిన్ని వార్తలు