అమల్లోకి ‘పేదల’ 10% కోటా

15 Jan, 2019 09:21 IST|Sakshi

న్యూఢిల్లీ: జనరల్‌ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019, జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చినట్లు సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించాలని ఇందులో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పిస్తూ ఒక క్లాజ్‌ను సంబంధిత అధికరణల్లో చేర్చారు. ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించి కుటుంబ ఆదాయం, ఇతర సూచీల ఆధారంగా ప్రభుత్వం నిర్ధారించే వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తారని చట్టంలో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు