బీజేపీ తదుపరి ఆపరేషన్‌ ఆకర్ష్‌.. సిక్కిం?

13 Aug, 2019 17:47 IST|Sakshi

గ్యాంగ్‌టక్‌ : సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ(సీడీఎఫ్‌) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో బీజేపీకి ఒక్క సీటుకూడా లేకపోవడం గమనార్హం. దీంతో సిక్కింలో ప్రతిపక్షపార్టీ అయిన సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీని తాజా చేరికలతో బీజేపీ విలీనం చేసుకోవడంతో ఆ పార్టీ అక్కడ రెండోస్థానంలో నిలిచింది. 25 సంవత్సారలకుపైగా సిక్కిం డెమోక్రటిక్‌పార్టీ అధ్యక్షుడు పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ సిక్కిం ముఖ్యమంత్రిగా పాలన అందించారు. ఆయన దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2019లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. ఇప్పుడీ తాజా చేరికలతో ఆ పార్టీలో కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు.

2019లో మొత్తం 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా 17 స్థానాలు గెలుచుకొని ప్రేమ్‌సింగ్ తమంగ్‌‌ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ బీజేపీ పోటీచేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు చేరడంతో అక్కడ కూడా బీజేపీ పార్టీ బలపడినట్లయింది. పార్టీమారిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ప్రధాని నరేంద్రమోదీ లుక్‌ ఈస్ట్‌ విధానం నచ్చిందని, మేం సిక్కింలో కమల వికాసం కోరుకుంటున్నామని’ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మాట్లాడుతూ సిక్కింలో ఇక నుంచి మేం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలో ఎమ్మెల్యేలు చేరితే ఫిరాయింపులను ప్రోత్సహించిందనే నిందను మోయకుండా మూడింట రెండు వంతుల సంఖ్యలో పార్టీలో చేర్చుకుంటూ రాజ్యాంగబద్దంగానే బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని సీడీఎఫ్‌ పార్టీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు.

సిక్కింలో కూడా పాగా వేస్తే
సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పది సంవత్సరాల క్రితం ఉనికిలో కూడా లేని బీజేపీ నేడు సిక్కిం మినహా మిగతా అన్ని ఈశాన్యరాష్ట్రాలలో ఏదో ఒక విధంగా అధికారంలో ఉంది. ఇక సిక్కింలో తాజా చేరికలతో ఆ పార్టీ అధికారానికి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉంది. అక్కడ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, అలాగే అధికార పార్టీకి మెజార్టీ తక్కువ ఉండటం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులో బీజేపీ కేసు వేయడం చూస్తుంటే అతి దగ్గరలోనే మరో కర్ణాటక, గోవా రాజకీయాలను సిక్కింలో చూస్తామనే వాదనలు వినిపిస్తున్నాయి.  కాగా సిక్కిం రాష్ట్రం నేపాల్‌, చైనా, భూటాన్‌ దేశాల సరిహద్దులో ఉండటంతో వ్యూహాత్మకంగా భారత్‌కు కీలకమైన రాష్ట్రంగా ఉంది.

మరిన్ని వార్తలు