అక్కడ నిత్యం మృత్యువుతో పోరాటమే...

13 Feb, 2016 17:32 IST|Sakshi
అక్కడ నిత్యం మృత్యువుతో పోరాటమే...

కారకోరమ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తై యుద్ధ క్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ మంచు పర్వత శ్రేణుల్లో శత్రు సేనలను ఎదుర్కోవడం చాలా సులభం. అక్కడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడమే చాలా కష్టం. అక్కడ భారత సైనికులు నిత్యం సాగించేది జీవన్మరణ పోరాటమే. అక్కడ పొరపాటున గ్లౌజు లేకుండా తుపాకీ ట్రిగ్గర్‌ను 15 సెకండ్లపాటు పట్టుకున్నామంటే చేతి వేళ్లకు ‘ఫ్రాస్ట్‌బైట్ (అతి శీతలం వల్ల జన్యువులు చచ్చిపోవడంతో పుండవడం)’ వస్తుంది. వెంటనే ఆ వేళ్లను కోసివేయాల్సిందే. సాక్స్ నుంచి బొటన వేళ్లు బయటకు వచ్చినా పరిస్థితి అంతే. ఒంటిలో అంగుళం కూడా వాతావరణానికి ఎక్స్‌పోజ్ కాకుండా నిండా చలి దుస్తులు ధరించాల్సిందే.

సముద్ర మట్టానికి దాదాపు 19వేల అడుగుల ఎత్తులో శత్రువుల ఉనికి కోసం నిరంతర నిఘా కొనసాగిస్తున్న భారత సైనికులకు నిద్ర పట్టదు. ఆకలి వేయదు. కంటి చూపు మసకబారుతుంది. గొంతు పూడుకపోతోంది. మాట సరిగ్గా రాదు. మతి మరుపు ముంచుకొస్తుంది. ఈ లక్షణాలు ఎక్కువైనప్పుడు వారిని బేస్ క్యాంప్‌కు తీసుకొచ్చి చికిత్స చేస్తారు. సరైన ఆహారం కూడా అందుబాటులో ఉండదు. మైనస్ 45 డిగ్రీల నుంచి మైనస్ 60 డిగ్రీల వరకు శీతలీయంగా ఉండే సియాచిన్ మంచు పర్వతాల్లో గాలిలో ఆక్సిజన్ శాతం కేవలం పది శాతం (మైదాన ప్రాంతాలతో పోలిస్తే) మాత్రమే ఉంటుంది.


ఆపిల్ పండుగానీ, నారింజ పండుగానీ క్షణాల్లోనే క్రికెట్ బాల్‌లా గట్టిగా తయారవుతుంది. ఆలుగడ్డను సుత్తిపెట్టి కొట్టినా ముక్కలవదు. అందుకని సైనికులు ఎక్కువగా కేన్‌లో భద్రపరిచిన డ్రై ఫుడ్‌నే తీసుకుంటారు. అది కూడా అతి తక్కువ మోతాదులో. నెలకు ఒక్కసారో, రెండు సార్లో తాజా ఆహారం అందుతుంది. చీతా హెలికాప్టర్ల ద్వారా సైన్యం 20 వేల అడుగులో తాజా ఆహార పదార్థాలను పడేసి వెళుతుంది. శత్రువుల కంటపడకుండా క్షణాల్లో పని ముగించాల్సి ఉంటుంది.

భారత సైనికులు కనపడని శత్రువు కోసం కళ్లు కాయలు కాసేలా నిరంతర నిఘా కొనసాగించడంతోపాటు అస్తమానం కిరోసిన్ స్టౌను వెలిగించి తుపాకులను ఎప్పటికప్పుడు వేడిచేస్తుండాలి. లేకపోతే తుపాకీ గొట్టం మంచుతో గడ్డకట్టుకుపోతుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తూనే ఉంటాయి. నెలకు మూడువారాలు ఈ గాలులను తట్టుకొని నిలబడాల్సిందే. నెలకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. డీఆర్‌డీవో ప్రత్యేకంగా తయారు చేసిన టబ్‌లోనే స్నానం చేయాలి. రోజూ కళ్లు మాత్రమే కడుక్కుంటారు. మంచు కరగించి ఆ నీటినే తాగుతారు. 20 లీటర్ల నీటికోసం దాదాపు గంటసేపు మంచును వేడి చేయాల్సి ఉంటుంది.  మంచు తుపానుల కారణంగా గడచిన 30 ఏళ్లలో 846 మంది భారత సైనికులు మరణించారని లోక్‌సభలో ప్రభుత్వమే ప్రకటించింది. శత్రువుల కాల్పుల్లో చనిపోయింది వారిలో పదోవంతు మంది కూడా ఉండరు.

ఇంతటి దారుణ పరిస్థితులు సరిహద్దుకు ఆవల కాపలాకాస్తున్న పాకిస్తాన్ సైనికలకు ఎదురుకావు. కారణం...మంచు పర్వతాలకు దిగువున వారి సైనిక స్థావరం ఉంది. వారు అక్కడి నుంచి పర్వతాలపైకి ఎక్కకూడదు. భారత సైనికులు పర్వతాల నుంచి ఆవలివైపు  కిందకు దిగకూడదు. అందుకోసమే ఇరువైపుల కాపలా కొనసాగుతోంది. ఇంతటి మృత్యువాతావరణంలో సైనిక నిఘాను కొనసాగించాల్సిన అవసరం ఉందా ? అంటూ అక్కడి భారత సైనికులు తరచూ చర్చించుకున్న సందర్భాలు అనేకం. ఫిబ్రవరి మూడవ తేదీన మంచు తపానులో కూరుకుపోయి చనిపోయిన పది మంది సైనికులతో కలసి అక్కడ రెండు సార్లు విధులు నిర్వహించి ప్రస్తుతం సెలవులో ఉన్న ఓ సైనికుడి కథనం ఇది. పేరు వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు.

మరిన్ని వార్తలు