సౌదీలో భారతీయుల క్షుద్బాధ

31 Jul, 2016 01:34 IST|Sakshi
సౌదీలో భారతీయుల క్షుద్బాధ

ఆకలితో అలమటిస్తున్న 10 వేల మంది
- ట్విటర్లో సుష్మకు వివరించిన ఓ బాధితుడు.. తక్షణమే స్పందించిన మంత్రి
- సౌదీలోని భారత రాయబార కార్యాలయం సాయంతో భోజన ఏర్పాట్లు
- అక్కడి అధికారులతో మాట్లాడుతున్న మంత్రులు వీకే సింగ్, ఎంజే అక్బర్
- జీతాలివ్వకుండా.. కంపెనీలు మూసేస్తున్న సౌదీ చమురు సంస్థలు
 
 జెడ్డా/న్యూఢిల్లీ : కుటుంబ పోషణకోసం.. పొట్టచేతపట్టుకుని సౌదీ బాటపట్టిన భారతీయులకు చాలా పెద్ద కష్టం వచ్చిపడింది. సౌదీ అరేబియా, కువైట్‌లో నష్టాల బాట పట్టిన చమురు, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తుండటం, జీతాలివ్వకుండా కంపెనీలను మూసేస్తున్నాయి. ఇటీవల ఈ సమస్య చాలా తీవ్రంగా మారింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో.. భారతీయ కార్మికులు ఎక్కువగా పనిచేసే కంపెనీలు మూసేయటంతో.. 10వేల మంది భారతీయులు మూడ్రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ.. ముందుగా అక్కడి బాధితులకు  భోజన, వసతి ఏర్పాట్లు చేసింది. ‘సౌదీలో ఏ ఒక్క భారతీయుడూ ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని సుష్మ ట్వీట్ చేశారు.

మూడ్రోజులుగా వీరు ఆకలికి అలమటిస్తున్నా ఈ విషయం బయటకు రాలేదు. అయితే.. ఇమ్రాన్ ఖోకర్ అనే వ్యక్తి ట్వీటర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మకు తమ సమస్య గురించి ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సుష్మ తక్షణ చర్యలకు ఉపక్రమించారు. భారతీయులకు ఆహారం అందించాలని సౌదీలోని భారత రాయబార కార్యాలయాన్ని మంత్రి ఆదేశించారు. సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సౌదీ వెళ్తారని, మరో మంత్రి ఎంజే అక్బర్ పరిస్థితిపై సౌదీ అధికారులతో మాట్లాడతారని పేర్కొన్నారు. అనంతరం భారతీయులకు ఆహారం సరఫరా చేస్తున్న దృశ్యాలను మంత్రి సుష్మ పోస్టు చేశారు. కువైట్‌లో పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకురావొచ్చని.. అయితే సౌదీ అరేబియాలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని సుష్మ తెలిపారు.

 గల్ఫ్‌లో భారతీయుల వెతలు
 ‘కూటి కోసం.. కూలి కోసం’ అంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు ఏ పనైనా చేసేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో భారతీయులే అత్యధికం. ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లేవారికి కచ్చితమైన పనేమీ దొరకదు. దీంతో ఏ పని దొరికితే అది చేసేందుకు వెనుకాడరు. చాలా సందర్భాల్లో భారతీయ కార్మికులకు అక్కడి యాజమాన్యాలు చాలా దారుణంగా చూస్తాయి.
 
 బాధితుల్లో తెలుగు వారు..
 జెడ్డాలో ఆకలికి అలమటించిన వారిలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామబాద్ జిల్లాల నుంచి వెళ్లినవారున్నారు. సౌదీ ఓజర్, సౌదీ బిన్ లాడెన్ కంపెనీల్లో ఏడు నెలలుగా పనిలేకపోవటంతో.. అలాగే అక్కడ జీవనం గడుపుతున్నట్లు అక్కడ పనిచేస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తి సాక్షికి ఫోన్‌లో తెలిపారు. తిండిలేక ఖర్జూరం, నీళ్లు తాగి బతుకుతున్నామన్నారు. పాస్‌పోర్టులు.. కంపెనీల దగ్గరే ఉండటంతో ఎక్కడికీ కదల్లేక పోతున్నారని.. తమను ఆదుకోవాలని అక్కడి భారతీయ కార్మికులు కోరుతున్నారు.
 
 అసలు సమస్యేంటి?
 గల్ఫ్ దేశాల్లో మొదట్నుంచీ చమురు, చమురు ఆధారిత కంపెనీలే ఎక్కువ. అయితే ఇక్కడి కంపెనీల్లో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో విదేశీ కార్మికులు వస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు మంచి ధర ఉన్నన్ని రోజులు ఈ కంపెనీలు కోట్లకు కోట్లు గడించాయి. అయినా కార్మికుల వేతనాలు నామమాత్రమే. కానీ ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గటం, రెండేళ్లుగా ఇదే ధోరణి కొనసాగుతుండటంతో.. గల్ఫ్ దేశాల కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. సౌదీ కంపెనీల పరిస్థితి మరీ దారుణం. దీంతో ఇక్కడి కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఈ పరిస్థితిని అంతర్జాతీయ మార్కెట్లు ముందుగానే ఊహించాయి. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటుందని హెచ్చరించాయి. అనుకున్నట్లుగానే ఉపద్రవం ముంచుకొచ్చింది. సౌదీలో పరిస్థితి తీవ్రంగా ఉండగా.. ఇతర గల్ఫ్ దేశాల్లో త్వరలోనే సమస్య తప్పేట్లు లేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా