డి విటమిన్ ఎక్కువై.. బాలుడి మృతి

30 Apr, 2016 15:11 IST|Sakshi
డి విటమిన్ ఎక్కువై.. బాలుడి మృతి

విటమిన్లు శరీరానికి ఎంతో అవసరం అంటారు. అందులోనూ సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ కూడా చాలా ముఖ్యం. అయితే.. ఆ విటమిన్ ఎక్కువైతే చనిపోతారని ఎవరైనా అనుకుంటారా? కానీ సరిగ్గా ఇదే జరిగింది. పదేళ్ల కుర్రాడికి విటమిన్ డి ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో ఆ కుర్రాడు ప్రాణాలు కోల్పోయాడు. అతడికి ఎదుగుదల తగినంతగా లేకపోవడంతో.. అతడికి విటమిన్ డి ఇవ్వాలని గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్యులు సూచించారు. అయితే.. 21 రోజుల్లో 6 లక్షల ఇంటర్నల్ యూనిట్ల (ఐయూ) విటమిన్ డి ఇంజెక్షన్లను అతడికి ఇచ్చారు. వాస్తవానికి ఇవ్వాల్సిన డోస్ కంటే అది 30 రెట్లు ఎక్కువ!!

విటమిన్ డి ఎక్కువ కావడంతో శరీరం విషపూరితమై, విపరీతమైన కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. వెంటనే అతడిని ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఎయిమ్స్ వైద్యులు అతడి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. కాల్షియం స్థాయి ఎక్కువ కావడంతో ఇన్ఫెక్షన్ వ్యాపించి అతడు చనిపోయాడు. పిల్లలకు గరిష్ఠంగా వారంలో 60వేల ఐయూ వరకు విటమిన్ డి డోస్ ఇవ్వచ్చు.  

ఇటీవలి కాలంలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సూర్యరశ్మికి దూరం అవుతుండటంతో విటమిన్ డి లోపం ఎక్కువగా కనపడుతోంది. అపార్టుమెంటు సంస్కృతి ఎక్కువ కావడం కూడా ఇందుకు మరో కారణం అవుతోంది. దాంతో వైద్యులు ఇంజెక్షన్ల రూపంలో డి విటమిన్ ఇస్తున్నారు. అది ఎక్కువైతే తలనొప్పి, వాంతులు, బరువు తగ్గిపోవడం లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు