లడఖ్లో టిప్పు సుల్తాన్, ఔరంగజేబు గస్తీ!

19 Jul, 2016 09:33 IST|Sakshi
లడఖ్లో టిప్పు సుల్తాన్, ఔరంగజేబు గస్తీ!

లడఖ్: టిప్పు సుల్తాన్, మహారాణా ప్రతాప్, ఔరంగజేబు ఇప్పుడు భారీ లోయలు, పర్వాతాల ప్రాంతమైన లడఖ్ ప్రాంతంలో సర్వే చేస్తున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా..! వందల ఏళ్ల కిందటి వీరు అసలు కలిసుండటం ఎలా.. ఇప్పుడు తిరిగి బతికొచ్చి సర్వేలు చేయడం ఎలా సాధ్యమవుతుందని అవాక్కవుతున్నారా.. ! అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం చైనా సరిహద్దుకు సమీపంలోని ఈస్టర్న్ లడఖ్ ప్రాంతంలో భారత ఆర్మీ యుద్ధ ట్యాంకులను దించింది. ఇందులో మూడు ట్యాంకర్ల పేరు టిప్పు సుల్తాన్, మహారాణా ప్రతాప్, ఔరంగజేబు.

గత ఏడు నెలల కిందటే ఈ ప్రాంతంలో మోహరించిన ఈ ట్యాంకర్లకు సంబంధించిన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. చైనా వ్యూహాత్మక దాడులకు దిగే అవకాశం ఉందని, సరిహద్దులోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు భద్రత కారణంగా వాటిని మోహరించారట. ప్రస్తుతం ఈ ట్యాంకర్లు 100 వరకు ఉన్నాయని, అవి కాస్త మరింత పెరుగుతాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సైనికుడు తెలిపాడు.

వాస్తవానికి ఈ ప్రాంతంలో భారత్ చాలా కాలం తర్వాత యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. 1962 చైనా-భారత్ యుద్ధ సమయంలో మాత్రమే వీటిని సరిహద్దు వద్ద తిప్పింది. అయితే, ఆ యుద్ధంలో ఓడిపోయిన కారణంగా వాటిని వెనక్కి తెప్పించింది. దీంతో చాలా కాలం తర్వాత మరోసారి అదే ప్రాంతంలో భారత ఆర్మీ 100 ట్యాంకర్లను మోహరిస్తోంది.

మరిన్ని వార్తలు