100మంది యువతుల అక్రమ రవాణా

27 Apr, 2017 12:42 IST|Sakshi
100మంది యువతుల అక్రమ రవాణా
ముంబయి: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 100మందికి పైగా.. అందరూ 14 నుంచి 16 ఏళ్ల లోపు యువతులే.. వీరందరినీ దేశ సరిహద్దులు అక్రమంగా దాటించారు. ముంబయి కేంద్రంగా మాయమాటలు చెప్పి యువతుల అక్రమ రవాణా చేస్తున్నారు. అది కూడా ప్యారిస్‌ నగరానికి.. గత మూడేళ్లుగా మైనర్లను అక్రమంగా ప్యారిస్‌కు తరలిస్తున్నట్లు మైనర్ల ట్రాఫికింగ్‌కు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ముంబయి క్రైం బ్రాంచ్‌ అధికారులు స్పష్టం చేశారు. పిల్లలకు మంచి విద్య, తల్లిదండ్రుల స్థితిగతుల్లో మార్పులు అనే పేరిట ఈ దారుణానికి తెగబడుతున్నట్లు గుర్తించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో సునీల్‌ నంద్‌వానీ, నర్సయ్య ముంజలి అనే వ్యక్తుల ఫోన్‌ నెంబర్లు ఉండటంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. నందవానీ అనే వ్యక్తి ఇటీవలె ఐదు నుంచి ఆరుగురు మైనర్లను ముంజలి మరో ఇద్దరినీ ప్యారీస్‌ పంపించే ప్రయత్నం చేయగా వారికి ఫ్రెంచ్‌ వీసాలు దొరకలేదంట. ప్రస్తుతం ఆ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు చెబుతున్నారు. 14 నుంచి 16 ఏళ్లలోపు మైనర్లను ఫ్రాన్స్‌కు తరలించి అక్కడే 18 ఏళ్లు వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత ఫ్రెంచ్‌ పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారంట. ఈ కేసులో అరిఫ్‌ ఫారూకీ అనే కెమెరామేన్‌ను, అసిస్టెంట్‌ కెమెరామెన్‌ రాజేశ్‌ పవార్‌ను, ఫాతేమా ఫరీద్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

నలుగురు మైనర్లను అక్రమంగా ఫ్రాన్స్‌కు తరలిస్తున్నారని సమాచారం అందిన వెంటనే ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ‘భారత్‌ నుంచి ప్యారిస్‌కు అక్రమంగా యువతులను తరలించడం వెనుక పెద్ద గ్యాంగ్‌ ఉంది. పంజాబ్‌లో ఉన్న ఓ వ్యక్తి మైనర్ల తల్లిదండ్రులను కలిసి వారిని విదేశాలకు పంపించేలా సర్దిచెప్పి తరలిస్తుంటాడు. ప్రస్తుతం మేం విడిపించిన మైనర్లు పంజాబ్‌కు చెందినవారు’ అని పోలీసులు చెప్పారు.
మరిన్ని వార్తలు