క‌రోనాను జ‌యించి..101వ వ‌సంతంలోకి

15 Jul, 2020 20:06 IST|Sakshi

ముంబై : కోవిడ్ ..చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రికీ సోకుతుంది. మ‌హారాష్ర్ట‌లో క‌రోనా కోర‌లు చాస్తున్న వేళ 100 ఏళ్ల వృద్ధుడు క‌రోనాను జ‌యించాడు. అంతేకాకుండా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్న రోజే ఆయ‌న 101వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. అర్జున్ గోవింద్ అనే వృద్ధుడు  పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా ప‌నిచేసి రిటైర్డ్ అయ్యారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో జూలై1న ముంబైలోని బాలాసాహెబ్ థాకరీ ట్రామా కేర్ ఆస్పత్రిలో చేర‌గా కరోనా వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. కేవ‌లం 15 రోజుల్లోనే కోవిడ్  నుంచి పూర్తిగా కోలుకోవ‌డంతో ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. (వైరల్‌ వీడియో: గున్న ఏనుగు వాకింగ్‌! )

ఆయ‌న పుట్టిన‌రోజు కూడా ఉండ‌టంతో ఆస్పత్రిలోనే సిబ్బందితో క‌లిసి బ‌ర్త్‌డే వేడుక‌లు నిర్వ‌హించారు. బుద‌వారం రాత్రే ఆయ‌నను డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్లు ఆసుప‌త్రి  సూపరింటెండెంట్ డాక్టర్ విద్యా మానే తెలిపారు. ఈ వేడుక‌ల్లో ఆస్ప‌త్రి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నార‌ని, 100 ఏళ్ల వృద్ధుడు కేవ‌లం ప‌క్షం రోజుల్లోనే కోలుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌త 24 గంట‌ల్లోనే మహారాష్ట్రలో కొత్త‌గా  6,741 కొత్త కేసులు నమోదుకాగా 218 మంది చ‌నిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ర్ట వ్యాప్తంగా న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,67,665 దాటింద‌ని ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  


 

>
మరిన్ని వార్తలు