రక్త చరిత్రకు వందేళ్లు పూర్తి...

13 Apr, 2019 10:34 IST|Sakshi

జలియన్‌ వాలాబాగ్‌ దురాగతానికి వందేళ్లు

 రాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాహుల్‌, ప్రముఖుల నివాళి 

చంఢీగడ్‌: బ్రిటీష్‌ పాలిత భారతదేశంలో మాయనిమచ్చగా చరిత్రలో నిలిచిపోయిన ఘటన జలియన్‌ వాలాబాగ్‌ దురాగతం. ఆంగ్లేయుల సైన్యం ఊచకోత దాటికి వేలాదిమంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పచ్చని నేలవంటి అమృత్‌సర్‌పై రక్తపుటేరులు పారించారు. బ్రిటీష్‌ దురాగతానికి వందేళ్లు గడిచినా.. భారతీయుల గుండెల్లో దిగిన ఆ తుపాకీగుండ్ల శబ్ధం ఇంకా మారుమోగుతూనే ఉంది. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ సమీపంలో గల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలను బ్రిటీష్‌ సైన్యం ఊచకోత కోసిన విషయం తెలిసిందే. భారతీయుల హక్కులను కాలరాస్తూ..  బ్రిటీష్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైన వేలమందిపై తూటల వర్షం కురించారు. ఈ ఘటనకు నేటితో వందేళ్లు పూర్తియిన సందర్భంగా అమృత్‌సర్‌లోని అమరుల స్మారక స్థూపం వద్ద  రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.

జనరల్‌ డయ్యర్‌ మారణహోమం
వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం నాడు అందరూ గుమ్మికూడి రౌలత్‌చట్టంపై చర్చిస్తున్నారు. అలాగే ఈ చట్టం కింద ప్రముఖ్య స్వాతంత్య్ర సమరయోధులు.. సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చే ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడంకోసం వారంతా ఎదురు చూస్తున్నారు. అయితే తమ పాలననకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సభ గురించి తెలుసుకున్న బ్రిటీష్ జనరల్‌ డయ్యర్‌ దారుణమైన మారణహోమానికి పాల్పడ్డాడు. మైదానానికున్న అన్ని దారుల్లో సాయుధులను మొహరించి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా దిగ్బంధించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో దాదాపు 400 మంది మృత్యువాతపడ్డట్లు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అంతకంటే ఎక్కువమందే దాదాపు 1000 మందికి పైగా చనిపోయివుంటారని చరిత్ర చెబుతోంది. ఈ దాడిలో అధికంగా చిన్నారులు. మహిళలే ప్రాణాలు కోల్పోయారు. భారతీయు ఒత్తిడిమేరకు ఈ ఉదంతంపై విచారణ జరపడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం 1919లో "హంటర్ కమిషన్" ఏర్పాటు చేశారు. అక్కడ సమావేశమైన గుంపుపై కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ డయ్యర్‌ ఒప్పుకున్నాడు. దీంతో బ్రిటీష్‌ ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకుంది. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మాత్రం అతన్ని ప్రశంసించారు.

పగతీర్చుకున్న ఉద్దమ్‌ సింగ్‌
పౌరులను చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణమైన జనరల్ డైయర్‌ను విప్లవకారుడు ఉద్దమ్‌ సింగ్‌ హత్యచేశాడు. ఘటన జరిగిన 21 ఏళ్ల అనంతరం..1940 మార్చి 13న లండన్ కాక్స్ టన్ హాల్‌లో అతన్ని హతమార్చడం విశేషం. ఆ తరువాత బ్రిటీష్‌ ప్రభుత్వం ఉద్దమ్‌ సింగ్‌ని ఉరితీసింది. భారత దేశపు తొలి మార్స్కిస్ట్‌గా బ్రిటీష్‌ అధికారులు ఉద్దమ్‌ను వర్ణించడం విశేషం. భారతదేశంలో ఈ ఘటనపై ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి జలయన్‌వాలాబాగ్‌ ఘటనే నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చరిత్రకారులు చెప్తుంటారు.

జలియన్ వాలాబాగ్ స్మారక స్తూపం
1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ) తీర్మానించింది.  అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్లల నుంచి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.

మరిన్ని వార్తలు