10 వేల కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

30 Nov, 2017 08:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దళాలు.. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకూ పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు 10 వేల కిలోలకు పైగానే ఉంటాయని భద్రతా దళాలు చెబుతున్నాయి. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 49.44 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను తమ సిబ్బంది పట్టుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేకే శర్మ తెలిపారు.  

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను బీఎస్‌ఎఫ్‌ బలగాలు బారీగా స్వాధీనం చేసుకున్నాయి.  మొత్తంగా 8,807 కిలోల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్‌ నుంచి దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న 439.21 కిలోల డ్రగ్స్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌తో పాటు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.20  లక్షల రూపాయల దొంగనోట్లను సైతం బీఎస్‌ఎఫ్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు