బీఎస్పీ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డిపాజిట్లు

27 Dec, 2016 00:00 IST|Sakshi
బీఎస్పీ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డిపాజిట్లు

న్యూఢిల్లీ : పాత నోట్ల మార్పిడికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో దేశ వ్యాప్తంగా భారీగా నల్లధనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ అధికారుల దాడులు మరవక ముందే మరో రాజకీయ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన పార్టీ ఖాతాలో పాటు ఆమె సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డబ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో ఎన్నికలకు ముందు బీఎస్పీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

బహుజన సమాజ్ పార్టీ బ్యాంక్ ఖాతాలో రూ. నూట నాలుగు కోట్లు, మాయావతి సోదరుడు బ్యాంక్ ఖాతాలో రూ.కోటి నలభై మూడు లక్షల నగదు దశల వారీగా డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం గుర్తించారు. ఢిల్లీలోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోల్ బాగ్ బ్రాంచిలో ఈ నగదు జమ అయ్యింది. ఈడీ అధికారుల బ్యాంక్ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు డిపాజిట్లు అయిన ఖాతాలపై విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బీఎస్పీ ఖాతాలో 102 కోట్ల నగదుకు వెయ్యినోట్లు, మిగతా మూడు కోట్లకు పాత 500 నోట్లు డిపాజిట్ చేసినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీనిపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మాయావతి సోదరుడు ఆనంద్‌కు నోటీసులు జారీ చేశారు. బీఎస్పీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజా ఘటనతో రాజకీయ దుమారం చెలరేగనుంది.

మరిన్ని వార్తలు