ఒక వ్య‌క్తి నుంచి 104 మందికి సోకిన క‌రోనా

7 Jul, 2020 12:15 IST|Sakshi

చెన్నై : క‌రోనా.. ఎప్పుడు ఎక్క‌డ‌నుంచి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఒక వ్యక్తి ద్వారా 104 మందికి క‌రోనా సోక‌డం ఇప్పుడు తమిళనాడులో సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల ప్ర‌కారం.. తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని(ఎన్‌ఎస్‌బీ రోడ్) ఓ ఆభ‌ర‌ణాల దుకాణంలో ప‌నిచేసే వ్య‌క్తికి జూన్ 22న క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. దీంతో అత‌ని నుంచి ఆ స్టోర్‌లో పనిచేసే మిగ‌తా 303 సిబ్బంది స‌హా వారి కుటుంబ‌ స‌భ్యుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 104 మందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. వీరిలో దాదాపు అంద‌రూ తురైయూర్, తాలూకాల గ్రామాలకు చెందిన‌వార‌ని అధికారులు వెల్ల‌డించారు.

దీంతో కేవ‌లం 13 రోజుల్లోనే రెండు గ్రామాల్లో క‌రోనా కేసులు 10 రెట్లు పెరిగాయి. జూన్ 22 వ‌ర‌కు 10 క‌రోనా కేసులు ఉండ‌గా ఇప్పుడు ఆ సంఖ్య 108కి చేరగా వారిలో న‌లుగురు మిన‌హా అంద‌రూ జ్యువెల‌రీ షాపుకి సంబంధించిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే మొట్ట‌మొద‌టి క‌రోనా కేసు న‌మోదుకాగానే మిగ‌తా సిబ్బందిని క్వారంటైన్‌కి పంప‌కుండా విధులు అప్పజెప్పారన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన జిల్లా యంత్రాంగం ఎన్‌ఎస్‌బీ రోడ్‌లోని మిగ‌తా దుకాణాల‌ను కూడా రెండు వారాల పాటు మూసి వేయాల‌ని ఆదేశించ‌డంతో పాటు ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్ర‌క‌టించింది. ఇక‌ దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. (భారత్‌: 20 వేలు దాటిన కరోనా మరణాలు)

మరిన్ని వార్తలు