కలుషిత నీరు తాగి 11 మంది పిల్లల మృతి

29 Apr, 2016 19:47 IST|Sakshi

జైపూర్: ప్రభుత్వ వసతి గృహంలో కలుషిత నీరు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన సంఘటన రాజస్థాన్ లోని జమ్ డోలీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 21 నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న పిల్లల్ని వసతి గృహ సిబ్బంది చికిత్స నిమిత్తం జైపూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకూ 15 మందిలో  పదకొండుమంది చిన్నారులు మరణించారు. వీరంతా 15 ఏళ్లలోపు వారే.

పిల్లలందరూ మానసిక, అంగ వైకల్యం గలవారని, అందుకే వారికి సోకిన ఇన్ఫెక్షన్ ప్రభావాన్ని తట్టుకోలేకపోయారని జేకే లాన్ ఆసుపత్రి డాక్టర్ అశోక్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది పిల్లలు మెదడువాపు బారిన పడ్డారని వైద్యులు వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో  సామాజిక శాఖ మంత్రి అరుణ్ చతుర్వేది శుక్రవారం జామ్డోలీలో హోమ్ ను పరిశీలించారు. హోమ్ నిర్వహణలో లోపాలను తెలుసుకోవడానికి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. హోమ్ లో మినరల్ వాటర్ సదుపాయం లేదని, బోర్ నీళ్లనే తాగుతున్నారని గుర్తించారు. కాగా ఈ దారుణ  సంఘటన ప్రభుత్వ వైఫల్యమేనని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు