11 సింహాలు మృత్యువాత

21 Sep, 2018 10:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే 11 సింహాలు మృతి చెందడం సంచలనంగా మారింది. అంతరించిపోతున్న సింహాల్ని కాపాడటానికి చర్యలు చేపడుతున్నామని చెబుతున్న అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణకు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. మృతిచెందిన 11 సింహాలను కూడా అమ్రేలి జిల్లా పరిధిలోని గిర్‌ తూర్పు డివిజన్‌లో గుర్తించారు. వాటి నమునాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జునాగఢ్‌ వెటర్నిటీ ఆస్పత్రికి తరలించామని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. 8 సింహాలు వాటి మధ్య పోరు కారణాంగానే మరణించి ఉంటాయని వాటి పోస్ట్‌ మార్టం నివేదికల ఆధారంగా ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మిగతా మూడింటి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

దీనిపై లోతైన విచారణ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు పరిమళ్‌ నత్వాని డిమాండ్‌ చేశారు. అవి ఏ కారణం చేత మరణించాయో(విద్యుద్ఘాతం, విషప్రయోగం, వేట) తెల్చాలని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, 2015 లెక్కల ప్రకారం గిర్‌ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు