70 రోజులు.. 11 లక్షలు!

14 Apr, 2015 01:14 IST|Sakshi
70 రోజులు.. 11 లక్షలు!
  • బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు  
  • దరఖాస్తులు ఆహ్వానించిన నాసా
  • కష్టపడి పని చేస్తేనే కానీ డబ్బులు రాని ఈ రోజుల్లో నిద్రపోతే కూడా డబ్బులొస్తాయా? అవును! ప్రయోగశాలకు వచ్చి మంచంపై పడుకుంటే చాలు.. రోజుకు రూ. 10 వేల చొప్పున డబ్బులిచ్చేస్తామంటున్నారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు! 70 రోజుల పాటు మంచంపై పడుకుంటే సరి.. రూ.11 లక్షలకు పైనే ముట్టజెపుతామని వారు ప్రకటించారు. ఇంతకూ డబ్బెందుకిస్తారు? ఈ వింత ప్రయోగాలేమిటి? ఎందుకు? అంటే...
     
    భూమి మీద రోదసి ఎఫెక్ట్

    అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాలంలో వ్యోమగాముల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయి. కండరాలు, ఎముకలు కరిగిపోతాయి. గుండె పనితీరు మందగిస్తుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రయోగాలు చేస్తున్నారు కూడా. అయితే, అన్ని పరీక్షలూ అంతరిక్షంలోనే చేయాలంటే కష్టం కాబట్టి.. ఇలా భూమ్మీదే రోదసి పరీక్షలకు రంగం సిద్ధం చేశారు. గురుత్వాకర్షణ లేమి ఎఫెక్ట్ కోసమని.. ఎల్లప్పుడూ తలను వెనక్కి వాల్చి.. కాళ్లు కొంచెం ఎత్తుగా చాపుకుని వెల్లకిలా పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
     
    అన్ని రోజులూ మంచం మీదే!
     
    పరీక్షలకు ఎంపికైతే.. తల కిందికి  వాల్చి, కాళ్లు పైకి ఉంచి వెల్లకిలా పడుకోవడం, చిన్నచిన్న పనులు చేసుకోవడంలో రెండు వారాలు శిక్షణ ఇస్తారు. తర్వాత పది వారాలు పూర్తిగా మంచంపై పడుకునే గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైకి లేచేదే ఉండదు. ఒకటీ, రెండూ అన్నీ మంచంపైనే! షవర్ హెడ్‌తో స్నానం చేయాలి. అప్పుడప్పుడూ చిన్నచిన్న కసరత్తులూ చేయాలి. ఇలా 70 రోజుల పాటు పడుకుని ఉంటే.. మెడ, దేహం, కండరాలు, ఎముకల్లో కలిగే మార్పులు, నొప్పి, గుండె ఆరోగ్యం వంటివి నిరంతరం పర్యవేక్షిస్తారు. పరీక్షలు అయిపోయాక 14 రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. కొంచెం కష్టమే కానీ.. ఇంత డబ్బు ఇస్తామంటే మేం రెడీ! అంటారా? కానీ కుదరదు లెండి. ఎందుకంటే ఈ పడక చాన్స్ అమెరికా పౌరులకు మాత్రమే!

మరిన్ని వార్తలు